FIFA: ఫిఫా ఫైనల్‌కు ముందు ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ.. అర్జెంటీనాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏంటి సంబంధం..?
FIFA World Cup 2022: సుమారు నెల రోజులుగా ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరింది. ఈనెల 18న అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగాల్సి ఉంది.
ఖతర్ వేదికగా నెలరోజులుగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఆఖరి సమరానికి సన్నద్ధమవుతున్నది. దిగ్గజ జట్లను ఓడించిన అర్జెంటీనా - ఫ్రాన్స్ లు ఇప్పటికే ఫైనల్ కు చేరుకుని తమ తుది పోరుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ట్విటర్ లో అర్జెంటీనా టీమ్ తో పాటు భారతీయుల అభిమాన బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పాస్ బుక్ ట్విటర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఉన్నట్టుండి ఎస్బీఐ ట్రెండింగ్ లోకి రావడమేంటి..? అర్జెంటీనాతో ఎస్బీఐకి ఏంటి సంబంధం..?
లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జెర్సీని మీరు ఎప్పుడైనా గమనించారా..? వాళ్లు ధరించే జెర్సీ ముందు భాగంలో మూడు స్కై బ్లూ కలర్ చారలు ఉంటాయి. మధ్యలో వైట్ కలర్ లైన్స్ ఉంటాయి. అలాగే ఎస్బీఐ పాస్ బుక్ ను చూడండి.. అది కూడా ఇలాగే ఉంటుంది. రెండు స్కై బ్లూ లైన్స్ మధ్య వైట్ కలర్ లైన్, అందులో ఎస్సీబీ లోగో ఉంటాయి.
భారత్ లో ఫుట్‌బాల్ కు అంత క్రేజ్ లేకున్నా కొద్దికాలంగా ఇందులో మార్పు కనిపిస్తున్నది. ఇండియన్ సూపర్ లీగ్ వచ్చిన తర్వాత ఇండియాలో కూడా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ పెరిగారు. ఖతర్ వరల్డ్ కప్ ను చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ రాత్రిళ్లు నిద్ర మానుకుని కూడా టీవీలలో చూస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ప్రి క్వార్టర్స్ వరకూ బ్రెజిల్ కు సపోర్ట్ చేశారని ఆ తర్వాత వారి దృష్టంతా అర్జెంటీనా వైపునకు మళ్లిందని తెలిపింది.
ఎస్బీఐ పాస్ బుక్ కలర్ జెర్సీని కలిగి ఉన్న అర్జెంటీనాకు ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మద్దతునివ్వడం పై సోషల్ మీడియా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజనులు ఇదే విషయమై ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ వరల్డ్ కప్ లో ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అర్జెంటీనాకు సపోర్ట్ చేయడానికి ఒక కారణముంది. ఒకవేళ అర్జెంటీనా ఓడిపోతే తమ ఎస్బీఐ బ్యాంకులో ఉన్న నగదు కూడా కోల్పోవాల్సి వస్తుందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు..’ అని ట్వీట్స్ చేస్తున్నారు. మరికొంతమంది.. ‘ఇదిగో ఇందుకే (ఎస్బీఐ పాస్ బుక్ ను చూపుతూ) ఇండియన్ ఫ్యాన్స్ అర్జెంటీనాకు సపోర్ట్ చేస్తున్నారు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫుట్‌బాల్ ఫీవర్ అధికంగా ఉండే కేరళ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘కేరళలో ఇతర బ్యాంకులు సరిగా సేవలను అందించడం లేదు. ఒకవేళ ఫిఫా వరల్డ్ కప్ గనక అర్జెంటీనా గెలిస్తే ఇక్కడి ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అంతా ఎస్సీబీఐకి షిఫ్ట్ అవుతారు..’ అని రాసుకొస్తున్నారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజనులను ఆకర్షిస్తూ వైరల్ గా మారుతున్నాయి.