FIFA: ఫ్రాన్స్ పరాజయం.. ఫ్యాన్స్ ఆగ్రహం.. అల్లర్లతో అట్టుడికిన దేశం
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి ఫైనల్ పోరులో అర్జెంటీనా చేతిలో ఓడిన ఫ్రాన్స్ ఆటగాళ్లపై ఆ దేశ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఓడాక వీధుల్లోకి వచ్చి రచ్చ చేశారు.
అభిమానం హద్దులు మీరితే ఏ స్థాయిలో ఉంటుందో క్రీడాకారులకు తెలుసు. మరీ ముఖ్యంగా క్రీడలను అమితంగా ఇష్టపడే దేశాలలో వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ లో తమ దేశం ఓటమిని అభిమానులు తట్టుకోలేరు. ఆటగాళ్లపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా ఫ్రాన్స్ లో ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ముగిసిన ఫైనల్ లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఫ్రాన్స్ జట్టుపై ఆ దేశ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.
లుసాలీ స్టేడియం వేదికగా నిన్న జరిగిన ఫైనల్ పోరును వీక్షించడానికి ఫ్రాన్స్ లో ప్రఖ్యాత ఛాంప్స్ - ఎలిసీస్ అవెన్యూకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఇక్కడ భారీ స్క్రీన్ లలో మ్యాచ్ లైవ్ చూసేలా ఏర్పాట్లు జరిగాయి. అయితే మ్యాచ్ జరుగుతున్నంతసేపు అంతా సజావుగానే సాగింది.
మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు మూడేసి గోల్స్ కొట్టడంతో పెనాల్టీ షూట్ అవుట్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే కొట్టగా అర్జెంటీనా నాలుగు గోల్స్ చేసింది. అర్జెంటీనా నాలుగో గోల్ కొట్టిన వెంటనే .. ఛాంప్స్ ఎలిసీస్ లో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. తమ దేశం ఓటమిని తట్టుకోలేని అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఆటగాళ్లపై ఆగ్రహం కాస్తా అక్కడ ఉన్న పోలీసులపైకి మళ్లింది. వారిపై బాణాసంచాలు పేల్చి, తమ వెంట తెచ్చుకున్న బీర్ బాటిళ్లు విసిరేశారు ఫుట్‌బాల్ ఫ్యాన్స్. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. గుంపులుగా ఉన్న నిరసనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టి పోలీసులపై దాడికి దిగిన, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక మొదలైన ఈ నిరసన దాదాపు సోమవారం ఉదయం వరకూ సాగింది. ప్రస్తుతానికి పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో అర్జెంటీనా ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించడంతో ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్షణకు తెరపడింది. అర్జెంటీనా 4-2 (3-3)తో ఫ్రాన్స్‌ను ఓడించి తమ మూడవ ఫిపా ప్రపంచ కప్ టైటిల్‌ను అందుకుంది.