FIFA: ప్రపంచపు బాధను తన బాధగా ఫీలై.. పోర్చుగల్ - ఉరుగ్వే మ్యాచ్ లో నిరసనకారుడి హంగామా
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ నిరసనలకు వేదిక అవుతున్నది. ప్రపంచంలో ప్రస్తుతం చర్చనీయాంశాలుగా ఉన్న పలు అంశాలపై ఫుట్‌బాల్ చూడటానికి వచ్చిన అభిమానులు తమదైన స్టైల్ లో నిరసన తెలుపుతున్నారు.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిరసనకారులకు వేదిక అవుతున్నది. ఖతర్ పోలీసులు, ఫిఫా సిబ్బంది ఎన్ని విధాలుగా నిర్బంధించినా, ఎన్ని కఠిన ఆదేశాలు జారీ చేసినా, నిరసనకారులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నా.. నిరసనలు మాత్రం ఆగడం లేదు. మ్యాచ్ చూడటానికి వచ్చిన సగటు అభిమాని నుంచి ఫుట్‌బాల్ ఆడే ఆటగాళ్ల వరకూ ఏదో ఒక రూపంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ఇదివరకే ఫిఫాలో పలువురు యువకులు.. స్వలింగ సంపర్కులపై ఖతర్ అనుసరిస్తున్న వైఖరిపై నిరసన తెలిపారు. దీంతో ఖతర్ ప్రభుత్వం, ఫిఫా సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ లో రెయిన్ బో ఫ్లాగ్ పై అనధికారిక బ్యాన్ విధించాయి. కానీ తాజాగా ఓ అభిమాని.. ఏకంగా అదే బ్యాన్ తో మ్యాచ్ జరుగుతుండగానే పటిష్ట భద్రతను ఛేదించుకుని లోపలికి దూసుకొచ్చాడు.
పోర్చుగల్ -ఉరుగ్వే మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.సూపర్ మ్యాన్ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి.. పోర్చుగల్ - ఉరుగ్వే మ్యాచ్ లో ఆట 50వ నిమిషంలో ఉండగా పటిష్ట భద్రత కళ్లుగప్పి లోపలికి పరుగెత్తుకొచ్చాడు. అతడి చేతిలో ‘రెయిన్ బో’ ఫ్లాగ్ ఉంది. టీషర్ట్ పై సూపర్ మ్యాన్ బొమ్మ కింద ‘సేవ్ ఉక్రెయిన్’ అని రాసి ఉంది. టీషర్ట్ వెనకాల ‘రెస్పెక్ట్ ఫర్ ఇరానియన్ ఉమెన్..’ అని కూడా ఉంది.
ఈ మూడు ప్రస్తుతం చర్చనీయాంశాలే కావడం గమనార్హం. ఎల్జీబీటీక్యూ మీద చాలా కాలంగా చర్చ సాగుతున్నా సంప్రదాయక ముస్లిం వాద దేశమైన ఖతర్ లో స్వలింగ సంపర్కులకు అనుమతి నిరాకరించడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనిపై యూరోపియన్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగానే యూరప్ కు చెందిన చాలా మంది ఫుట్బాల్ ఫ్యాన్స్ గల్ఫ్ కు రాలేదు.
ఇక రష్యా - ఉక్రెయిన్ ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఎదురవుతున్నా పుతిన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇరాన్ లో మహిళలు వేసుకునే హిజాబ్ మీద కూడా తీవ్ర ఉద్యమం సాగుతున్నది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో ఇప్పటికే పలువురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు కూడా వారికి సంఘీభావంగా ఇంగ్లాండ్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం వహించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.