కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుంది. చాలావరకూ పండ్లు, కాయలు సీజన్  ను బట్టి లభిస్తాయి. ఏ కాలంలో ఏ పండ్లు తింటే మంచిదో దాని ప్రకారమే ప్రకృతి మనకందిస్తుంటుంది. చలికాలంలో ఎక్కువగా లభించే కాయల్లో ఒకటి ఉసిరికాయ. 

 ఉసిరికాయంటే కేరాఫ్ విటమిన్ సి గా చెప్పవచ్చు. లేదా విటమిన్ సి కు పర్యాయ పదమే ఉసిరికాయని అనవచ్చు. చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయల్ని తింటే చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. చలికాలం లో ఉసిరికాయల్ని ఓ భాగంగా చేసుకుంటే మరీ మంచిది.

ఉసిరికాయల్లో విటమిన్‌ సి మనకు సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్‌ సి మనకు ఇందులో లభిస్తుంది. 
ఉసిరికాయల్లో ఉండే విటమిన్‌-సి మన శరీర నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుంగా చూస్తుంది. 
శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
డయాబెటిస్‌ ఉన్నవారు ఉసిరి కాయలను తినడం ద్వారా కావాల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి. దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.