ఎదుగుతున్న పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తప్పకుండా పెట్టండి..
మన ఎముకలకు కాల్షియం చాలా చాలా అవసరం. ఇది లేకుంటే ఎముకల పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి, బలహీనమైన ఎముకలు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇవి రాకూడదంటే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి.
ఎదుగుతున్న పిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారాన్నే పెట్టాలి. అప్పుడే వారి శరీర ఎదుగుదల బాగుంటుంది. తెలివితేటలు బాగుంటాయి. అయితే ఎదుతున్న పిల్లలకు కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే ఇది ఎముకలు, దంతాల ఏర్పాటు, అభివృద్ధికి సహాయపడుతుంది. కౌమారదశలో ఎముక సాంద్రత, ఎముక ద్రవ్యరాశిని నిర్వహించడానికి ఈ పోషకం సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీ పిల్లల ఆహారంలో తగినంత కాల్షియం వారి ఎదుగుదలకు చాలా అవసరం. బాల్యంలో బలమైన ఎముకలను కలిగి ఉండటం వల్ల జీవితాంతం వారి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఆవు పాలు తాగించాలి. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎదుగుతున్న పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల నువ్వులు
నల్ల నువ్వులు కూడా ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. చాలా మంది పిల్లలు నువ్వుల లడ్డూను ఎక్కువగా తింటారు. అందుకే వారి టిఫిన్ బాక్స్ లో పెట్టి చిరుతిండిగా ఇవ్వొచ్చు.
పెరుగు
పెరుగు చాలా సులువుగా జీర్ణం అవుతుంది. పెరుగు కాల్షియానికి మంచి వనరు. పెరుగులో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా ఉన్నాయి. పిల్లలకు రోజూ పెరుగు తినడం అలవాటు చేయండి. పెరుగు లేదా కర్డ్ రైస్ ను కూడా పిల్లలకు ఇవ్వొచ్చు. పెరుగును తింటే ఎముకలు బలంగా ఉంటాయి.
పప్పులు
కాల్షియం పుష్కలంగా ఉండే రాజ్మా, శనగపప్పు, బ్లాక్ చన్నా, పచ్చిబఠానీలు, చిక్కుడు మొదలైన పప్పు దినుసులను ఉల్లిపాయలు, టమోటాలతో ఉడికించి అన్నం లేదా చపాతీతో కలిపి తీసుకోవచ్చు. వీటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ పప్పు దినుసులు ఎముకలు బలంగా ఉంచుతాయి.
ఆకుపచ్చ కూరగాయలు
మెంతికూర, బ్రొకోలీ, పాలకూర, ముల్లంగి ఆకులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర పచ్చడిని పిల్లలు ఇష్టపడతారు. ఈ గ్రీన్ చట్నీని ఎలాగైనా తీనొచ్చు.
గింజలు
వాల్ నట్స్, అంజీర, ఖర్జూరం, నేరేడు పండ్లు వంటి గింజలు కాల్షియానికి గొప్ప వనరులు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజూ మీ బిడ్డకు పెట్టండి. బలంగా తయారవుతాడు.