ద్రాక్ష పండ్లు సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా ప్రతిరోజూ ఏదో ఒక పండును డైట్ లో భాగం చేసుకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే.. మనం కొనే పండ్లు తాజాగా ఉన్నాయా లేవా అని మాత్రమే మనం చూస్తాం. కానీ.. అవి తాాజాగా కనిపించడానికి దానిపైన రసాయనాలు చల్లుతారని మీకు తెలుసా? పండ్లను సరిగా శుభ్రం చేసుకోకుండా తింటే వాటి వల్ల మనం అనారోగ్యం పాలౌతామని తెలుసా?

ద్రాక్ష పండ్లపై రసాయనాలు..

ఓ వైపు ఎండాకాలం మొదలైంది, అప్పుడే మార్కెట్లోకి పచ్చటి, నల్లటి, విదేశీ ద్రాక్ష వచ్చేసింది. మార్కెట్లో అమ్మే చాలా ద్రాక్ష పండ్లు తాజాగా కనిపించడానికి ఒక కృత్రిమ రంగు, రసాయనం కలిపిన నీటిని స్ప్రే చేస్తారు, దీనివల్ల ద్రాక్ష పండ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అంతేకాదు, మెరిసేలా, తాజాగా కనిపించేలా చేయడానికి పండ్లను తేలికపాటి మైనపు ద్రావణంలో ముంచుతారు. కలుపు మొక్కలు, చెట్లను నాశనం చేసే పురుగుల నుండి పండ్లను కాపాడటానికి రసాయన పురుగుమందులను అన్ని పంటల్లోనూ వాడుతున్నారు. అందుకే కొనుక్కొని తెచ్చిన తర్వాత నీటిలో కడిగితే పురుగుమందులు లేదా రసాయనాలు పోవు. ఈ ద్రాక్ష పండ్లు తింటే పెద్ద, చిన్న తేడా లేకుండా అందరి శరీరానికి హాని కలుగుతుంది.

చాలా కాలం పాటు ఈ రసాయనాలు శరీరంలోకి వెళితే, రక్తంతో కలిసి రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, నరాల పనితీరుకు ఆటంకం, కాలేయం లేదా ప్రేగు సంబంధిత సమస్యలు, చివరికి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ద్రాక్ష నుండి పురుగుమందులను తొలగించే మార్గాలు:

1. ఏదైనా రసాయనం లేదా పురుగుమందును తొలగించడానికి ఉత్తమమైన పద్ధతి ఉప్పు నీటిలో ద్రాక్షను నానబెట్టడం. అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టి, ఆపై శుభ్రమైన నీటితో కడగాలి.

నీటిలో వెనిగర్ కలిపి కూడా ద్రాక్షను కడగవచ్చు. అందులో చిటికెడు ఉప్పు వేయండి. ఇందులో 10 నుండి 15 నిమిషాలు ద్రాక్షను నానబెట్టండి. తర్వాత నీటి నుండి తీసి శుభ్రమైన నీటిలో బాగా కడగాలి.

3. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా ద్రవాలు దొరుకుతున్నాయి, అవి పండ్లు లేదా కూరగాయలను క్రిమిరహితం చేస్తాయని చెబుతారు. ఈ రకమైన రసాయనాలు కలిపిన ద్రవాలు ప్రత్యేకంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. బదులుగా, బేకింగ్ సోడాను నీటిలో కలిపి అందులో 15 నిమిషాలు ద్రాక్షను నానబెట్టి కడగవచ్చు.