Asianet News TeluguAsianet News Telugu

మండిపోతున్న కరివేపాకు ధర..!

ప్రస్తుతం కరివేపాకుకు సీజన్‌ కాకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి. గ్రేటర్‌ పరిధిలోని హోల్‌సేల్, రిటైల్, రైతుబజార్లకు రోజు దాదాపు 10 టన్నుల వరకు దిగుమతి అవుతుంది. 

Curry leaves  cost still high in Hyderabad
Author
Hyderabad, First Published Mar 3, 2021, 11:55 AM IST

ఎవరినైనా పట్టించుకోకపోతే.. నన్ను కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నావ్ అంటూ సామేత వాడేస్తారు. అయితే.. ఇక నుంచి కరివేపాకుని అలా తక్కువగా తీసి పారేయలేం. ఎందుకంటే.. ఈ ఆకుల ధర ఇప్పుడు మండిపోతోంది.

కరివేపాకుకూ ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. దిగుబడి తగ్గి...కొరత ఏర్పడడంతో నగరంలో కరివేపాకు ధరలకు రెక్కలొచ్చాయి. మునుపెన్నడూ లేనివిధంగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేజీ రూ.120 పలుకుతోంది. ఇక రిటైల్‌ మార్కెట్‌లో ఒక కట్ట రూ. 5-10కి విక్రయిస్తున్నారు. 

ప్రస్తుతం కరివేపాకుకు సీజన్‌ కాకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి. గ్రేటర్‌ పరిధిలోని హోల్‌సేల్, రిటైల్, రైతుబజార్లకు రోజు దాదాపు 10 టన్నుల వరకు దిగుమతి అవుతుంది. కరోనా కారణంగా గత పది నెలలుగా కరివేపాకు వినియోగం కూడా బాగా పెరిగింది.

కరివేపాకులో లభించే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో ఫోలిక్‌ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, కాల్షియం, పాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. 

జీర్ణక్రియను మెరుగుదల పరిచి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుందని గ్రేటర్‌ జనం కరివేపాకును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరల్లో వాడడమే కాకుండా కరివేపాకు పొడిని ప్రత్యేకంగా తయారు చేసి కూడా అన్నంతోపాటు తీసుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios