కుక్కల ప్రేమికులకు ఈ వార్త ఎంతో నచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయో ఇక్కడ మేము వివరించాము. అలాగే భారతదేశంలో ఎన్ని శునకాలు ఉన్నాయో కూడా చెప్పాము.
ఎప్పటినుంచో కుక్క మనిషికి ఇష్టమైన మూగజీవి. మనిషి తన స్నేహితుడిలాగే శునకాలను చూసుకుంటాడు. గ్రామాల నుంచి నగరాల వరకు కుక్కలని పెంచుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అలాగే వీధుల్లో ప్రతి చోటా కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. ఈమధ్య ఢిల్లీలో రోడ్లమీద కుక్కలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. అప్పటినుంచి శునకాల అంశం పై సెలబ్రిటీలు విమర్శలు చేస్తూనే వచ్చారు. కొంతమంది కుక్కలను తలుచుకొని ఏడ్చుకుంటూ వీడియోలు కూడా పోస్ట్ చేశారు. ఇలాంటి సందర్భంలో అసలు ప్రపంచంలో ఎక్కువ శునకాలు ఏ దేశంలో ఉన్నాయి? మనదేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసుకుందాం.
అత్యధిక కుక్కలు ఈ దేశంలోనే
కొన్ని దేశాల్లో శునకాలను అతిగా ప్రేమిస్తారు. ఇంట్లోని సభ్యుల్లాగే చూసుకుంటారు. కేవలం మనదేశంలోనే కాదు ఎన్నో చోట్లా ఈ అలవాటు ఉంది. ఇక దేశం ప్రపంచంలో అత్యధికంగా శునకాలు ఉన్న దేశం అమెరికా. ఈ అగ్రరాజ్యంలో 75.8 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఆ కుక్కల కోసం ప్రత్యేకమైన డాగ్ పార్కులు, గ్రూమింగ్ సెంటర్లు, సంరక్షణ కేంద్రాలు, జంతు సంరక్షణ చట్టాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే జంతు హింస పై కేసులు కూడా అధికంగానే నమోదవుతాయి.
అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో 35.7 మిలియన్లు కుక్కలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు సగం ఇళ్లల్లో కనీసం ఒక కుక్క అయినా ఉంటుంది. టీకాలు కూడా వాటికి ప్రత్యేకంగా వేస్తారు. వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు కూడా ఎన్నో చేసింది. ఆ తర్వాత చైనాలో 2.74 కోట్ల శునకాలు ఉన్నాయి. గతంలో కొన్ని నగరాల్లో చైనాలో పెంపుడు కుక్కలను పెంచడంపై నిషేధం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అక్కడి ప్రజలు కూడా కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. దీంతో చైనాలో పెంపుడు కుక్కల మార్కెట్ భారీగానే పెరిగింది.
మనదేశంలో ఎన్ని కుక్కలు?
చైనా తర్వాత స్థానంలో మన భారతదేశమే నిలిచింది. భారతదేశంలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అన్నీ కలిపి 1.53 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో వీధి కుక్కలే ఎక్కువ. ఇదే మన దేశానికి పెద్ద సవాలుగా మారిపోయింది. మన దేశం 70 శాతం కుక్కలకు టీకాలు వేయాలని, స్టెరిలైజేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల వాటి సంఖ్యను నియంత్రించవచ్చని భావిస్తోంది. అలాగే ప్రజల భద్రత కూడా ఉంటుందని వారి నమ్మకం. మన దేశంలో కుక్క కాటు వల్ల మరణిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అందుకే వీధి కుక్కలను నియంత్రించాల్సిన అవసరం వస్తోంది.
వీధికుక్కలు బస్సులు, రైళ్లలో
భారతదేశం తర్వాత రష్యాలో 1.5 కోట్ల కుక్కలు ఉన్నాయి. అక్కడ వీధి కుక్కలు కూడా అధికమే. వాటిని మెట్రో శునకాలు అని పిలుస్తారు. ఇక రైళ్లు, బస్సులలో ప్రయాణించడం కూడా అక్కడ మనం చూస్తాము. ప్రభుత్వము, సామాన్య ప్రజలు కూడా ఆ కుక్కలను జాగ్రత్తగా చూస్తారు. బస్సు, రైళ్లల్లో ఎక్కినా కూడా ఏమీ అనరు. జపాన్లో కూడా దాదాపు 12 మిలియన్ల కుక్కలు ఉన్నాయని అంచనా. ఇక్కడ పెంపుడు కుక్కలను పిల్లలతో సమానంగా కుటుంబంలో భాగంగా చూస్తారు. జపాన్లో పెంపుడు జంతువుల కోసమే ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ పరిశ్రమల విలువ 10 బిలియన్ల డాలర్లకు పైగానే ఉంటుంది.
ఇక తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ 112.6 మిలియన్ కుక్కలను కలిగి ఉంది. దీని తర్వాత అర్జెంటీనా 9.2 మిలియన్ కుక్కలతో, ఫ్రాన్స్ 7.4 మిలియన్ల కుక్కలతో ఉన్నాయి. ఇక పదవ స్థానంలో రొమేనియా ఉంది. రొమేనియాలో కుక్కల సంఖ్య దాదాపు 41 లక్షలు. ప్రపంచంలో అత్యధికంగా శునకాలను కలిగి ఉన్న దేశాలు ఇవే. మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది.
