బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి పది రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఆయన మరణానికి సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క ఫడ్జ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక అభిమానులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఆయన పెంపుడు కుక్క కూడా చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన తరువాత ఫడ్జ్‌ అన్నం తినటం మానేసిందని ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఫడ్జ్ అదే బాధతో మరణించిందన్న వార్త కూడా మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సుశాంత్ మరణించిన తరువాత దిగులుగా ఉన్న ఫడ్జ్‌ ఫోటోలు చూసిన వారు నిజంగానే మరణించి ఉంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వార్త వైరల్‌ కావటంతో నిజానిజాలు తెలుసుకోకుండా జనాలు వైరల్‌ చేస్తున్నారు.

నిజానికి సుశాంత్‌కు పెంపుడు కుర్ర ఫడ్జ్ మరణించలేదు. ప్రస్తుతం ఆ కుక్క సుశాంత్ కుటుంబ సభ్యుల దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఫడ్జ్‌ మాత్రమే కాదు సుశాంత్ దగ్గర మరో మూడు కుక్కలు ఉన్నాయి, అయితే కాస్త డల్‌ గా ఉన్న ఆరోగ్యంగానే ఉన్నాయని సుశాంత్ సన్నిహితులు వెల్లడించారు. ఈ నెల 14న సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఆయన మరణంపై ప్రస్తుతం ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.