ముంబైలోని అమర్‌ జవాన్ జ్యోతి స్మారక చిహ్నాన్ని ఇద్దరు యువకులు ధ్వంసం చేసినట్లుగా ఉన్న ఫోటోను ‘మార్ఫింగ్ ఫోటో’ అంటూ సినీ నటి స్వరా భాస్కర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడంతో పాటు దానిని తొలగించారు.

అయితే స్వర భాస్కర్ అవగాహన లేమిని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ సహా, పలువురు ట్విట్టర్ యూజర్లు గుర్తించారు. ముంబై అమర్ జవాన్ మెమోరియల్ విధ్వంసానికి గురైనట్లుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షాప్‌ పిక్ కాదని, అసలైనదేనని ఒకరు ట్వీట్ చేశారు. 

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా 1857 నాటి తిరుగుబాటు సమయంలో అమరవీరులైన సిపాయిలు సయ్యద్ హుస్సేన్, మంగల్ గాడియాల సంస్మరణార్ధం ఈ స్మారకాన్ని నిర్మించారు. అయితే ఫోటోలో కనిపించిన అల్లర్లకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి శిక్ష విధించేలా చేసింది. 

వాస్తవం:

ఈ ఫోటోలు ‘‘ ఫోటో షాప్ ’’ కాదు. 2012లో ముంబైకి చెందిన సూఫీ సంస్థ రాజా అకాడమీ మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలకు తమ మద్ధతు తెలిపిందేకు ముంబైలో హింసాత్మక నిరసనల సమయంలో ఈ ఫోటోను క్లిక్‌మనిపించారు. 

నివేదిక ప్రకారం.. అమర్ జవాన్ స్మారకాన్ని ధ్వంసం చేసిన వారిలో ఒకరిని అబ్ధుల్ ఖాదిర్ మహ్మద్ యూనస్ అన్సారీగా గుర్తించారు. ఈ ఘటన జరిగిన 18 రోజుల తర్వాత అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

జనవరి 25, 2013 నాటి బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అమర్ జవాన్ స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేసిన వారి గురించి సమాచారం అందించిన వారికి బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించారు.

ముంబైలోని అమర్ జవాన్ స్మారక చిహ్నాన్నీ ముస్లిం యువకులు ధ్వంసం చేస్తున్న అసలు ఫోటోలను స్వరా భాస్కర్ తప్పుగా ట్వీట్ చేసినట్లు తేలడంతో ఆమె తన తప్పును సరిదిద్దుకున్నారు.