Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన డైరక్టర్ వైవిఎస్ చౌదరి

 ఒకప్పుడు వరస విజయాలని పొందిన వైవియస్ చౌదరి గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నారు. ఓ మంచి స్క్రిప్టుతో తిరిగి ఫామ్ లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

Yvs Chowdary praises KCR for social text book
Author
Hyderabad, First Published Sep 6, 2020, 3:55 PM IST

దర్శకుడుగా ఒకప్పుడు వరస విజయాలని పొందిన వైవియస్ చౌదరి గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నారు. ఓ మంచి స్క్రిప్టుతో తిరిగి ఫామ్ లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు మొదట నుంచీ నందమూరి తారక రామారావు అంటే ప్రాణం. ఆయన బ్యానర్ లో వచ్చే సినిమాల ప్రారంభంలో ఈ విషయం మనం గమనించవచ్చు. హరికృష్ణతో కూడా ఆయన సినిమాలు చేసారు. తాజాగా ఆయన కేసీఆర్ కు  కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకూ అంటే ఎన్టీఆర్ జీవితాన్ని 10వ తరగతి పాఠ్యాంశంలో చేర్చినందుకు. ఆయన ఈ విషయమై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. అది మీరూ చదవండి.

‘మరణంలేని జననం ఆయనిది,

అలుపెరగని గమనం ఆయనిది,

అంతేలేని పయనం ఆయనిది..’

ఆయనే.. ఆయనే..

‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’ మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు.. ఆయన దివ్యమోహన రూపం సినిమాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నిచ్చింది, తిరిగి ఆ రూపమే రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టిన సంచలన మరియూ సంక్షేమ పధకాల ద్వారా జనాకర్షణలో, మరెందరో రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా నిలిచింది.

‘ఇండియా’లోని ఓ ‘రిక్షాపుల్లర్’ నుండి ‘అమెరికా’లోని ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల’ వరకూ కుల, మత, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న చాలా మందికి, ‘ఆయన’ తన రూపం ద్వారా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు, తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా ఇంకెంతో ఉద్వేగాన్ని నింపారు. దాంతోపాటు తన సినిమాల ద్వారా, హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన.. మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ.. ఓ ‘మహాయోధుడి’గా, ఓ ‘కారణజన్ముడి’గా, ఓ ‘యుగపురుషుడి’గా అవతరించారు.

‘ఆత్మగౌరవం’ నినాదంతో ఢిల్లీ గద్దెతో మడమ తిప్పని పోరాటం చేసి, అప్పటిదాకా ‘మదరాసీ’లుగా పిలవబడుతున్న ‘తెలుగు జాతి’కి ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపునీ, ‘తెలుగు జాతి’లో ఒక మహత్తర రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి ‘తెలుగు’వారి పౌరుషాన్ని దశదిశలా చాటిన ‘అవిశ్రాంత యోధుని’ మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ ‘మహనీయుని’ గురించి తెలుసుకుని స్మరించుకోవటం అనేది మన పౌరుషాన్ని, మన జాతినీ, మన భాషనీ మరియూ మనల్ని మనం గౌరవించుకున్నట్లుగా భావిస్తూ.. ముఖ్యమంత్రి వర్యులు, శ్రీయుతులు ‘కె.సి.ఆర్‌.’గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.. శ్రీయుతులు ‘ఎన్. టి. ఆర్‌.’గారు ఢిల్లీ గద్దెపై జరిపిన మడమతిప్పని ఆత్మగౌరవ, పౌరుష పోరాటాన్ని 10వ తరగతి సాంఘీక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చి భావితరాల్లో స్ఫూర్తివంతమైన చైతన్యాన్ని నింపే ప్రక్రియకి ఆదర్శవంతంగా నిలిచింది.

ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి వర్యులు, శ్రీయుతులు ‘కె.సి.ఆర్‌.’గారి నాయకత్వంలోని ‘తెలంగాణ’ ప్రభుత్వానికి.. ప్రపంచ వ్యాప్త అన్న ‘ఎన్‌. టి. ఆర్‌.’గారి అభిమానుల తరపున వేవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ..

‘నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ..’

మీ

వైవిఎస్ చౌదరి.

(‘అన్న’ NTR వీరాభిమాని) 

Follow Us:
Download App:
  • android
  • ios