సినీ నటుడు తారకరత్న భౌతికకాయాని నివాళులర్పించేందుకు రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు. తాజాగా తారకరత్న భౌతికకాయానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. 

సినీనటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని తారకరత్న నివాసానికి చేరుకున్న షర్మిల ఆయన పార్ధీవ దేహం వద్ద పుష్పగుచ్ఛం వుంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే వున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో షర్మిల కొద్దిసేపు మాట్లాడారు. 

ఇక, ఈరోజు మోకిలలోని నివాసంలోనే తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు తారకరత్న భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం 8.45 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు తారకరత్న భౌతికకాయం తరలించనున్నారు. మధ్యాహ్నం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. 

Also Read: తారకరత్న భౌతికకాయం వద్ద బాలకృష్ణ కంటతడి.. పరుగెత్తుకుంటూ వచ్చి బాలయ్యను హత్తుకున్న నిషిక..

కాగా.. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న తారకరత్న చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది