సినీ నటుడు తారకరత్న భౌతికకాయాని నివాళులర్పించేందుకు రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు.

సినీ నటుడు తారకరత్న భౌతికకాయాని నివాళులర్పించేందుకు రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు. తారకరత్న‌ భౌతికకాయానికి ఆయన బాబాయి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో బాలకృష్ణ మాట్లాడారు. తారకరత్న అలేఖ్య రెడ్డిని కూడా బాలకృష్ణ ఓదార్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తారకరత్న కూతురు నిషిక బాలకృష్ణను హత్తుకున్నారు. ఈ క్రమంలోనే నిషికను బాలకృష్ణ ఓదార్చారు.

ఇదిలా ఉంటే.. తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపంది. కుటుంబ సభ్యులు ఆయన మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న భౌతికకాయం వద్ద ఆయన కుమార్తె నిషిక వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈ దృశ్యాలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. 

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడిన చిరంజీవి.. తారకరత్న కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. 

ఇక, ఈరోజు మోకిలలోని నివాసంలోనే తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇక, తారకరత్న భౌతిక కాయాన్ని రేపు(సోమవారం) అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం 8.45 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు తారకరత్న భౌతికకాయం తరలించనున్నారు. మధ్యాహ్నం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.