ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోరు. ఈగోలకు పోయి వాదిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు యంగ్ హీరోలు మాత్రం తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. మొన్నామధ్య 'నోటా' సినిమా ఫ్లాప్ అంటూ విజయ్ దేవరకొండ స్వయంగా ట్వీట్ చేశాడు.

'అవును నా సినిమా ఫ్లాప్.. మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తా' అని అన్నాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ కూడా తను నటించిన 'అంతరిక్షం' సినిమాపై ఇలానే స్పందించాడు. ఇలాంటి సినిమా బి, సి సెంటర్స్ లో ఆడే సిఎంమ కాదని పబ్లిక్ గా ఒప్పుకున్నాడు. సినిమాపై మరో పది కోట్ల పెట్టుబడి పెట్టి ఉంటే బాగుండేదని అన్నాడు. 

తాజాగా శర్వానంద్ కూడా ఈ లిస్టులోకి చేరిపోయాడు. శర్వా నటించిన 'పడి పడి లేచే మనసు' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా కొట్టింది. ఈ సినిమా రిజల్ట్ పై స్పందించిన శర్వా.. ''ఈ సినిమా గురించి చాలా ఊహించుకున్నాను. పెద్ద సినిమా పెద్ద రేంజ్ కి వెళ్తుందని అనుకున్నాను.

కథ విన్నప్పుడు, సినిమా చేసేప్పుడు, ఇప్పుడు కూడా ఒకటైతే బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడతాను. అయితే విమర్శకులతో పాటు చాలా మందిని ఈ సినిమా మెప్పించలేకపోయింది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి యంగ్ హీరోలు తమ సినిమాల రిజల్ట్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. గొప్పలకు పోకుండా రిజల్ట్ ని యాక్సెప్ట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.