సూపర్‌ స్టార్ మహేష్ బాబు నటుడిగా కొనసాగుతూనే బిజినెస్‌మేన్‌గానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్ నెలకొల్పిన మహేష్, ఇటీవల నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తను హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్న మహేష్, ఇప్పుడు ఇతర హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ యంగ్ హీరోతో సినిమాను కూడా ప్రారంభించాడు మహేష్.

టాలీవుడ్‌ విలక్షణ నటుడు అడవి శేష్‌ హీరోగా మేజర్‌ పేరుతో ఓ బయోగ్రాఫికల్‌ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. షూటింగ్ కూడా ప్రారంభించాల్సి ఉన్నా.. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా పనులు జరుగుతుండగానే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కించేందుకు ఓ కథను ఫైనల్‌ చేసిన మహేష్ ఆ కథకు శర్వానంద్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట.

ఇప్పటికే శర్వానంద్‌తో సంప్రదింపులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే శర్వా ఇంకా ఓకె చెప్పాడా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఎక్కువగా పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ కథలకు ఓకె చెప్పే శర్వా, మహేష్ ఓకె చేసిన కథకు ఎస్‌ అనే అవకాశమే ఎక్కువ అని తెలుస్తోంది. అయితే అసలు విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.