తన గురించి తప్పుడు రాతలు రాయటం, అనవసరంగా అసత్య ప్రచారం చేయటం ఆపాలని కేజీఎఫ్‌ హీరో యష్ మీడియా వర్గాలను ఉద్దేశించి చెప్పారు.  నిన్న శనివారం రోజంతా కన్నడ మీడియాతో పాటు మన తెలుగు మీడియాలోనూ ఓ కన్నడ నటుడిని హత్య చేయటానికి సుపారీ ఇచ్చినట్లు...ఆ నటుడు మరెవరో కాదని యశ్ అని  శనివారం ప్రచారం జరిగింది.

సోషల్ మీడియాలో జరిగిన రచ్చకు అయితే అంతేలేదు. దాంతో యశ్ అభిమానులు కంగారుపడ్డారు.  ఈ నేపధ్యంలో హీరో యశ్‌ మీడియా సమావేశం నిర్వహించి నిజా నిజాలు చెప్పారు. యశ్ మాట్లాడుతూ... తనపై ఎవరికి ద్వేషం లేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరని  స్పష్టం చేశారు. ఇదే విషయంపై సీసీబీ అడిషనల్‌ కమిషనర్‌ అలోక్‌కుమార్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.

హోం మంత్రి ఎంబీ పాటిల్‌తో కూడా మాట్లాడినట్లు యశ్‌ మీడియాకు వివరించారు. తనపై సుపారీ  ఇచ్చే పరిస్థితులు  కన్నడ సినీ పరిశ్రమలో ఎవరికి  లేదని, అనవసరంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని యశ్‌ ఆవేదనతో అన్నారు.  అంతేకాకుండా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ..తనను హత్య చేస్తానంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్‌ రాలేదని యశ్‌ స్పష్టం చేశారు.

ఇక యాష్ నటించిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. కేజీఎఫ్ చిత్రం  భారీ స్థాయిలో తెరకెక్కింది.  దేశంలోని ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో క్యూరియాసిటీ పెరిగి మంచి ఓపినింగ్స్ రప్పించాయి.  హీరో ఏ భాషకు చెందిన వ్యక్తి అని చూడకుండా.. కంటెంట్ బాగుంది అంటే థియేటర్స్ కు జనాలు వచ్చి చూసారు.  సినిమా బాగుంటే.. బాక్సాఫీస్ అంకెలు నిండుతాయని యాష్ అంటున్నాడు.