2018లో ఘన విజయం సాధించిన సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్. యష్ హీరోగా కన్నడలో రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు. తమిళ, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా కేజీఎఫ్ 2ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తుండగా, రవీనాటండన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అక్టోబర్ 23న రిలీజ్‌ చేస్తున్నట్టుగా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లోగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీంతో ఈ  సినిమాను అనుకున్న డేట్ కు రిలీజ్ చేయటం కష్టమని తెలుస్తోంది. సినిమా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ కాకూడదని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. అందుకే ఆలస్యమైన అంచనాలను తగ్గట్టుగా సినిమా రూపొందించాలని ఫిక్స్‌ అయ్యారట.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి కాగా మరో రెండు కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ఆ సీన్స్‌ను త్వరలో కర్ణాటకలోనే సెట్‌ వేసి షూట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీగా విజువల్‌ ఎఫెక్ట్స్ కూడా అవసరం ఉండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పదని తెలుస్తోంది. అందుకే ముందుగా ప్రకటించినట్టుగా అక్టోబర్ 23న కాకుండా 2021 మొదట్లో సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.