రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన క్రేజీ చిత్రం రంగస్థలం. క్రేజీ కాంబినేషన్ కావటంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఇక రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఘనమైన విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసే పనిలో ఉంది. ఇప్పటికే విడువులైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ సమయంలో రంగస్థలం చిత్రం వివాదంలో చిక్కుకోవడం చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చే విధంగా ఉంది.

 

దర్శకుడు సుకుమార్ రెగ్యులర్ కమర్షియల్ దర్శకులకు భిన్నం. తన చిత్రాల్లో ప్రత్యేకత ఉండాలని ఆయన కోరుకుంటారు. ఆ అభిరుచితోనే రంగస్థలం చిత్రాన్ని అందంగా రూపొందిస్తున్నారు. చరణ్ నటన కోసం ఈ చిత్రంలో రాంచరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా చిట్టిబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రలో చరణ్ నటన ఎలా ఉండబోతోందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 

తాను నటించిన ప్రతి చిత్రంలోనూ క్యూట్ క్యూట్ హావభావాలు, అద్భుతమైన నటనతో మ్యాజిక్ చేయడం సమంతకు వెన్నతో పెట్టిన విద్య. 1985 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో సమంత ఆకట్టుకోవడం ఖాయం అని అంటున్నారు. భారీగా ప్రచార కార్యక్రమాలు రంగస్థలం చిత్ర యూనిట్ భారీగా ప్రచార కార్యక్రమాలని ప్లాన్ చేస్తోంది. మార్చ్ 18 న వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ వైభవంగా జరపనున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో రంగస్థలం చిత్రంలోని సాంగ్ వివాదంలోచిక్కుకుంది.

 

రంగస్థలం చిత్రంలోని సాంగ్స్ వినసొంపుగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ మరో మారు తన పనితనం చూపించాడు. ఈ చిత్రంలోని రంగమ్మ మంగమ్మ అనే సాంగ్ అయితే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొడుతోంది. తాజాగా ఈ పాట వివాదంలో చిక్కుకుంది. రంగమ్మ మంగమ్మ సాంగ్ లోని ఓ లిరిక్ యాదవ కమ్యూనిటీ మహిళల మనో భావాలకు వ్యతిరేకంగా ఉందని ఆ కమ్యూనిటీ నాయకుడు రాములు యాదవ్ పేర్కొన్నారు. గొల్ల భామ వచ్చి గోరుగిల్లుతుంటే అనే లిరిక్ తమ మహిళల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని.. దానిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ లిరిక్ ని తొలగించకుంటే రంగస్థలం చిత్రంపై ఫిర్యాదు చేస్తామని, అన్ని చోట్లా విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. దీనిపై రంగస్థలం చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.