Asianet News TeluguAsianet News Telugu

కట్టప్పకు అర్జునుడు, అభిమన్యుడు గుర్తొచ్చాడు- బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పెషల్ ఇంటర్వ్యూ

  • బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తో ఏసియానెట్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ
  • కథ, సక్సెస్ పై విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర  విషయాలు వెల్లడించిన విజయేంద్ర ప్రసాద్
  • అసలు సినిమా కథ అంటే ఇలానే ఉండాలంటున్న విజయేంద్ర ప్రసాద్

 

writer vijayendra prasad special interview for asianet news about bahubali2

ప్రశ్న1... బాహుబలి లాంటి చారిత్రక సినిమా రాయటానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి...

జవాబు... నిజానికి బాహుబలి కథ రాయటానికి పెద్దగా ప్రేరణ పొందిందేం లేదు. ఈ కథ రాయటానికి అసలు ఆలోచన కూడా లేదు. కానీ కథకన్నా ముందు ఆ సినిమాలోని కేరక్టర్స్ రాసాను.  ఆ కేరక్టర్స్ అన్నీ ఒక దాన్ని మించి ఒకటి పవర్ ఫుల్ గా ఉండాలనుకున్నా. అబద్ధాలు అంటే ఇష్టమైన నాకు అందమైన కేరక్టర్లు సృష్టించడం పెద్దగా కష్టమనిపించలేదు. అయితే ఆ కేరక్టర్ల మధ్య సంబంధం ఎలా ఉండాలి అనేది రాజమౌళి చాలా వివరంగా చర్చించి, ఇద్దరం అనుకుని ఒక తుది నిర్ణయానికి వచ్చేస్తాం. అలా కేరక్టర్లన్నీ రూపొందించి, వాటి మధ్య సంబంధం కలిపి అబ్ధుతంగా తెరకెక్కించేందుకు వీలుంగా అల్లుకున్నదే బాహుబలి. ఈ చిత్రానికి అందులోని పాత్ర‌లే ఇన్స్‌పిరేష‌న్‌... ఒక్కో పాత్ర ఒక్కో రకమైన విభిన్న‌మైన పాత్ర‌.. ప్రతీ పాత్ర‌కు ప్రాధాన్యత ఉంది. ఇలా విభిన్న పాత్ర‌లు అన్ని ఒక‌చోట చేరితే అదే బాహుబ‌లి క‌థ‌.

అదెలాగంటే... రాజమౌళి నాతో ప్రభాస్ తో సినిమా చేయాలి నాన్నా. మంచి ఫైట్స్ కావాలన్నాడు. అందులో ఎమోషన్స్ ఉండాలి అన్నాడు. ఇక లేడీ కేరక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలి. అన్నాడు. అప్పుడు అనుకున్నదేంటంటే... ఇలాంటి కథ కావాలంటే జానపదం అయితేనే కుదురుతుందని అనుకున్నాను. అంతే కాదు రాజమౌళి నాతో చెప్పిన మరో అంశమేంటంటే.. గ్రే కేరక్టర్స్ కావాలన్నాడు. అంటే మంచి వారు చెడు చేయడం. చెడువారు పశ్చాత్తాపంతో మంచి చేయడం... ఇలాంటివి. దీంతో నేను రెండు రోజులు ఆలోచించి రాజమౌళితో ఒక సీన్ చెప్పా.

ముందుగా... కట్టప్ప... ఒక వృద్ధుడైన గురువు. పిల్లలకు కత్తి యుద్ధం నేర్పుస్తుంటాడు. అప్పుడు ఒక విదేశీ వచ్చి చూసి... మీ అంత వీరుడు లేడనుకుంటా అంటాడు. అప్పుడు కట్టప్ప విచిత్రంగా చూసి... బాహుబలి పేరు వినలేదా అని అడుగుతాడు... అతని వీరత్వం గురించి వివరిస్తూ... నేను బాహుబలితో కలిసి అడవిలో వెళ్తుంటే.. దుండగులు మా మీద పడ్డారు. అప్పుడు బాహుబలి దుండగులను నరుకుతా వెళ్తుంటే... నేను ఆశ్చర్యపోయి.. మహాభారతంలో అభిమన్యుడు ఇలాగే చేసి ఉంటాడా అని ఆలోచించే లోపే తాకిన బాణం దెబ్బతో వచ్చిన మచ్చ ఈ బాహువు మీదున్నది(విదేశీయునికి చూపిస్తాడు). ఆ కాసేపటికే.. రణరంగంలో అభిమన్యుడు చనిపోయాడని తెలుసుకున్న అర్జునుడి విజృంభణ ఇలానే ఉండేదేమో అని అశ్చర్య పోతుంటే తగిలిన బాణంతో వచ్చినది ఈ రెండో మచ్చ. ఇక సాయంత్రం నీరెండలో రక్తాభిషేకం జరిగిన శివునిలా మెరిసిపోతున్నాడు. ఒట్టేసి చెప్తున్నా... ఒక రక్తపు చుక్క కూడా అతనిది కాదు. అంతా శత్రువులదే. అన్నాను. అయితే ఆ వీరుడు చనిపోయాడు అని చెప్పాను. మరి అంతటి వీరుడు ఎలా చచ్చి పోయాడు అని వెంటనే సందేహం. దానికి సమాధానం కత్తిపోటుకన్నా దారుణమైనది వెన్ను పోటు... నేనే పొడిచా..అంటాడు కట్టప్ప. అది మొదట చెప్పిన సీన్.

writer vijayendra prasad special interview for asianet news about bahubali2

ప్రశ్న2... ఫస్ట్ సీన్ చెప్పిన తర్వాత ఏం జరిగింది..

జవాబు... ఇక దాంతో రాజమౌళి అటెన్షన్, కళ్లలో వెలుగు కనిపించింది. ఇక ఆ తర్వాత రెండో సీన్ చెప్పాను.

ఉదృత ప్రవాహంతో ఉప్పొంగుతున్న నది. ప్రవాహంలో ఆధారంగా కనిపిస్తున్న పుల్ల. ఆ పుల్లను ఆధారం చేసుకుని పసిబిడ్డను కాపాడిన తల్లి. ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని పెంచుకునే గిరిజన తల్లిదండ్రులు. అది రెండో సీన్.

ఇక ఆ తర్వాత మూడో సీన్ చెప్పా... అదే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో అనే ప్రశ్నకు సమాధానం. ఈ మూడు సీన్స్ చెప్పటంతోనే ఇక దీన్ని ఎందాకైనా తీసుకెళ్దామనుకున్నాం. అలా ఆ కెరక్టర్లు, ఆ సీన్స్ చుట్టూ... కథను అల్లాం.



ప్రశ్న3... అసలు రాజ‌మౌళి ఇన్ని అద్భుతాల‌ను ఎలాగ సృష్టించ‌గ‌లుగుతున్నారు? ఆయ‌న‌ చిన్నప్పటి నుండి పెరిగిన విధానం ఏంటి ఆయనకు స్పూర్తినిచ్చే అంశాలేంటి? 

జవాబు... రాజమౌళికి చిన్న‌ప్ప‌టి నుండి ఫ్యాంట‌సీ క‌థ‌లంటే ఇష్టం.. చంద‌మామ క‌థ‌ల‌ను బాగా ఇష్ట‌ప‌డే వాడు. ఇక అలనాటి మాయాబ‌జార్ లాంటి సినిమాల్లో విజువల్ వండర్స్ కొన్ని రాజమౌళి ఆలోచ‌నా విధానం పై బ‌ల‌మైన ముద్ర వేశాయి. ఇక రాజమౌళి కూడా మంచి కథా రచయిత. నా కథలన్నింటిలోనూ రాజమౌళి సహకారం నాకు ఉంటుంది. అయితే ఒక కథను తెరకెక్కించే విధానంలో రాజమౌళికి ప్రత్యేకత ఉంది. ప్రతి సన్నివేశంలో ప్రత్యేకత ఉండాలని పట్టుబట్టి మరీ అనుకున్నది వచ్చేలా చూసుకుంటాడు.

ప్రశ్న4... ఇవాల ఎక్క‌డ చూసినా.. ఎవ్వ‌రి నోట విన్నా బాహుబ‌లి 2 గురించే ఇలాంటి సంద‌ర్భంలో మీకు ఏమ‌నిపిస్తోంది ?
 
జవాబు... చాలా ఆనందంగా ...కాసింత గ‌ర్వంగా అనిపిస్తోంది.. ఎందుకంటే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఇచ్చాం అంత‌క‌న్నా ఆనందం ఇంకేం వుంటుంది. ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ లో హాలీవుడ్ రేంజ్ కు వెళ్లామంటే సంతోషకరం. బెంచ్ మార్క్ సినిమా అని చెప్పటానికి గర్వంగా ఉంది. ఇక జనం ట్రైలర్స్ డబ్బులు ఇచ్చి చూశారండీ... బాహుబలి ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లాంటిది. సెకండ్ పార్టే అసలు కథ. అసలు సినిమా అంటే ఇలాగే ఉండాలి. రాజమౌళి లాంటి వాళ్లు ఇంకా రావాలి.

writer vijayendra prasad special interview for asianet news about bahubali2



ప్రశ్న5... ప్ర‌తి ఒక్క‌రు కీర‌వాణి సంగీతం గురించి మాట్లాడుకుంటున్నారు... ఆయ‌న గురించి మీ మాట ?

జవాబు... ఆయ‌న సంగీతం గురించి మాట్లాడుకోవాలి అంటే స‌మ‌యం స‌రిపోదు...ఇవాళ కీర‌వాణి సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకువెళ్లింది అని చెప్ప‌డానికి ఏమాత్రం సందేహించ‌ను. కీరవాణి మా కుటుంబ సభ్యుజు కావటం ఇంకా ఆనందింతదగ్గ విషయం. క‌ల‌సివుంటే క‌ల‌దుసుఖం ..అని ఏనాడో చెప్పారుగా. మా కుటుంబ సభ్యులంద‌రు బాహుబలిని వారి భుజ‌స్కందాల పై మోసిన తీరు ప్ర‌శంస‌నీయం.

ప్రశ్న6... యానిమేష‌న్ లో విజువ‌ల్ ఎఫెక్ట్ లో తెలుగు సినిమా స్టాండ‌ర్డ్స్ ను మ‌రో స్థాయికి తీసుకు వెళ్లిన సినిమా బాహుబ‌లి.. సో ..మీ ఓపినియ‌న్ ?

జవాబు... సినిమా అంటే ఇలాగే వుండాలి అని భావిస్తాను...ఇంకా చెప్పాలంటే యానిమేష‌న్‌తో , గ్రాఫిక్స్ తో హిట్ కొట్ట‌చ్చు అనుకోవ‌డం త‌ప్పు...క‌థ‌కు అవ‌స‌ర‌మైన గ్రాఫిక్స్ ఉంటేనే ప్రేక్ష‌కుడు ఆమోదిస్తాడు... సో అన్నిటి క‌న్నా సినిమాకు క‌థే ముఖ్యం. ప్రాణం, బ‌లం...ఆ త‌రువాతే గ్రాఫిక్స్ వాటిని మ‌రోస్థాయిని తీసుకు వెళ్ల‌డానికి ప‌నికివ‌స్తాయి...క‌థ లేకుండా ఎన్ని గ్రాఫిక్స్ చేసినా వృథా...

 

ప్రశ్న7... ప్రభాస్-రానాల్లో ఎవరు ఎక్కవ ఇష్టం...

జవాబు... కథ రాసినప్పుడు భల్లాల దేవుడి మీదే ఎక్కువ కాన్సెంట్రేషన్ పెట్టాం. హీరోలను ముందే అనుకుంటా. ప్రభాస్ కోసమే కథ రాసినా రానా నటించిన భల్లాల కేరక్టర్ పైనే ఎక్కువ సమయం కూడా వెచ్చించా. భల్లాలదేవుడంటేనే ఇష్టం. అతనితోపాటు బిజ్జల దేవుడు కూడా. ఇక రమ్య కృష్ణ కూడా శివగామిగా సరైందనిపించింది. అయితే రాజమౌళి వేరేవాళ్లని వెతుకుతున్నాట్ట. కానీ చివరకు ఆమే సివగామి అయింది.

ప్రశ్న8... రాజమాత శివగామి పాత్ర ముందు హీరో, విలన్ లు చిన్నబోతారనిపించలేదా...

జవాబు... ఒక సినిమాలో డ్రామా రావాలంటే... పెయిన్ రావాలి. కథలో మంచి వాళ్లకు మధ్య ఘర్షణ జరిగితేనే ఆ బాధ వస్తుంది. హీరో, విలన్ కేరక్టర్స్ రెండూ కథకు ప్రాణం పోసేవే. అసలు ఘర్షణ ఇద్దరు బలవంతుల మధ్యనే ఉండాలి. అంతే కాని బలహీనుడు బలవంతుడి మధ్య ఉంటే డ్రామా రాదు. విలన్ అయినా, హీరో అయినా రాజకుమారుడు అంటే అందంగా ఉండాలి. అయితే భల్లా, బాహుల్లో హీరో బాహుకు ధర్మం అనే ప్రత్యేక ఆయిధం ఎక్స్ ట్రా పవర్ ఇస్తుంది. బాహు ధర్మంవైపు నిలిచాడు కాబట్టే జనం గుండెల్లో విజేతగా నిలిచాడు.

writer vijayendra prasad special interview for asianet news about bahubali2

 

ప్రశ్న9... బాహుబలి 3 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా...

జవాబు... బాహుబలి 3 సినిమా ఏం అనుకోలేదు కానీ... కొత్తగా నెట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. గేమ్ ఆఫ్ ది త్రోన్స్ లాంటి సిరీస్ చేద్దామనుకుంటున్నాం. దానిలో అసలు బాహుబలి కథకు ముందు ఏం జరిగింది. శివగామి ఎవరు, బాహుబలి తండ్రి ఎలా చనిపోయాడు, భల్లాలదేవుడు చనిపోయాక జరిగే కథ, ఇలా చాలా మిగిలే ఉంది. అందుకే శివుడి పాత్ర ముందుకెళ్లి ఏం చేస్తుంది... అంతటి భారీ కిరీటం తల కిందపడి ఎక్కడుంది. ఇలాంటివి చాలా చాలా వున్నాయి. ఏదేమైనా ఇంతటి అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు శోభు,ప్రసాద్ లకు సన్మానం చేయాలి. థాంక్యూ.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios