ప్రముఖ దిగ్గర రైటర్, ఎంపీ విజయేంద్రప్రసాద్.. తాజాగా `ఆర్ఎస్ఎస్`పై సినిమాని ప్రకటించారు. అంతేకాదు ఓ వేదికపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి హాట్ టాపిక్ అవుతున్నాయి.
ప్రముఖ దిగ్గజ రైటర్, ఎంపీ విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్‌ఎస్ ఎస్ గురించి తెలుసుకోనందుకు తనని తాను చెప్పుతో కొట్టుకోవాలనిపించిందంటూ సంచలనానికి తెరలేపారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మరి ఇంతకి ఏం జరిగింది, విజయేంద్రప్రసాద్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎక్కడ చేశారనేది చూస్తే, `నైజాం విముక్త స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎఫ్‌సీసీలో జరిగాయి.
నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన వీరులు కుమురం భీమ్, రాంజీ గోండ్, షాయబుల్లాఖాన్, జమలాపురం కేశవరావు, చాకలి ఐలమ్మ వంటి వారి పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ వేడుక నిర్వహించారు. ఇందులో `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్` రైటర్ విజయేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకార్ల గురించి, తెలంగాణ సాయుధ పోరాట యోధుల గురించి ఆయన చెప్పుకొచ్చారు. రాజకార్లపై తెలంగాణలో మహిళలు, గ్రామీణులు తిరగబడి వేయ్ వేయ్ ధరువేయ్ అంటూ పాడుతూ వారిని ఎదురించి సంఘటనలు తాను సుద్దాల హన్మంతు ద్వారా తెలుసుకున్నానని వెల్లడించారు. రాజకార్ల ఆగడాలను ప్రస్తావిస్తూ తెలంగాణ వీరులను ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను `ఆర్‌ఎస్‌ఎస్`పై సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు. ఐదేళ్లకి ముందు వరకు తనకు ఆర్‌ఎస్‌ఎస్ గురించి తెలియదన్నారు. అంతేకాదు భారతదేశంలో చాలా మంది దానిపై ఉన్న అభిప్రాయాన్నే తాను కలిగి ఉన్నానని, గాంధీని హత్య చేసినదాంట్లో ఈ సంస్థకి సంబంధం ఉందని తాను కూడా నమ్మానని తెలిపారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా తీయాలనుకున్నప్పుడు ఐదేళ్ల క్రితం మోహన్‌భగవత్‌ని కలిసిన తర్వాత తాను చాలా రియలైజ్ అయ్యానని చెప్పారు. ఇన్నాళ్లు తాను ఈ సంస్థ గురించి తెలుసుకోనందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేశారు విజయేంద్రప్రసాద్.
అంతేకాదు తాను ఈ విషయంలో చేసిన తప్పుకి, పొరపాటుని సరిదిద్దుకునేందుకు గాను `ఆర్‌ఎస్‌ఎస్` గొప్పతనం గురించి భారత దేశ ప్రజలందుకు తెలుసుకునేలా, తెలిసేలా సినిమా తీయాలనుకుంటున్నట్టు చెప్పారు విజయేంద్రప్రసాద్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక గొప్ప రైటర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సందర్భంగా ఆయన ప్రాంతాల మధ్య విభేదాలు పోయేలా తన కథలుంటాయని, మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించేలా తాను కథలు రాస్తానని ఇండియా, పాకీస్థాన్ మధ్య గ్యాప్ పోగొట్టే ప్రయత్నంలో భాగంగానే `భజరంగి భాయ్‌జాన్` కథ రాశానని తెలిపారు విజయేంద్రప్రసాద్.
