నటుడు నరేష్ (Naresh)పేరిట హైదరాబాద్ లో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడ్డట్లు సమాచారం అందుతుంది.  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

సెలబ్రిటీల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఆ మధ్య శిల్పా చౌదరి అనే మహిళ టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళల నుండి వందల కోట్ల వసూళ్లకు పాల్పడింది. చివరికి మహేష్ సోదరి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా రమ్య రఘుపతి అనే మహిళ పలువురు మహిళల దగ్గర ఈ తరహా అక్రమ వసూళ్లకు పాల్పడింది. 'మా' మాజీ అధ్యక్షుడు,సీనియర్ నటుడు నరేష్ పేరున ఈ మోసానికి ఆమె పాల్పడినట్లు సమాచారం. రమ్య రఘుపతిపై ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళల నుండి సమాచారం సేకరిస్తున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

రమ్య రఘుపతి (Ramya Raghupati) నరేష్ మాజీ భార్య అని సమాచారం. ఈ క్రమంలో నరేష్ ఫ్యామిలీతో ఆమె పలు సందర్భాల్లో ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు చూపించి సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు మరికొందరు మహిళల నుండి ఆమె లక్షల రూపాయలు వసూలు చేశారు. అలాగే తమ వ్యక్తిగత అకౌంట్స్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. డబ్బులు తిరిగి చెల్లించాలని ఎంత అడిగినా.. రమ్య స్పందించడం లేదు. దీంతో మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ తో పాటు అనంతపూర్, హిందూపురంలో పలువురి వద్ద నుండి ఆమె నరేష్, కృష్ణ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి డబ్బులు దండుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఐదుగురు మహిళల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

 ఈ వివాదంపై నటుడు నరేష్ స్పందించారు. రమ్య రఘుపతి పాల్పడిన వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే రమ్య రఘుపతితో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నరేష్, రమ్య కుటుంబాలు ఓకే క్యాంపస్ లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా ఇరు కుటుంబాల మధ్య పరిచయాలున్నాయి. ఇక విచారణలో అన్ని వివరాలు బయటికొచ్చే అవకాశం కలదు. ప్రస్తుతానికి ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయగా... ఇంకా బాధితులు ఎవరో గుర్తించాల్సి ఉంది.