కెరీర్ ఆరంభంలో హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన తమన్నా.. ఈ మధ్యకాలంలో బాగా డీలా పడింది. గత రెండేళ్లలో ఈ బ్యూటీ అరడజనుకి పైగా ఫ్లాప్ సినిమాలో తన ఖాతాలో వేసుకొంది. ఆమె నటించిన ఏ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు.

రీసెంట్ గా ఆమె నటించిన 'అభినేత్రి 2', 'ఖామోషీ' సినిమాలైతే ఎప్పుడు విడుదలై.. పోయాయో కూడా తెలియలేదు. హారర్ జానర్ ఈ బ్యూటీకి కలిసి రాలేదనే చెప్పాలి. అయినప్పటికీ ఆమెని మరో హారర్ జోనర్ కోసం ఎంపిక చేసుకున్నాడు. 'రాజు గారి గది' సిరీస్ లో భాగంగా వస్తోన్న మూడో భాగంలో తమన్నా లీడ్ రోల్ లో కనిపించనుంది.

ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన 'రాజు గారి గది 2' లో నాగార్జున, సమంత లాంటి స్టార్లు కనిపించారు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఈసారి తమన్నాని నమ్ముకొని సీన్ లోకి ఆమెను తీసుకొచ్చారు.

తమన్నా తప్పించి ఈ సినిమాకు అదనపు ఆకర్షణలేవీ లేవు. అసలే హిట్లు లేక బాధపడుతున్న తమన్నా ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. గురువారం నాడు ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకొంది. మరికొద్ది రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.