ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని, ఆయన హీరోగా తాను లాంచ్‌ కావాలనుకున్నాడు ప్రముఖ రైటర్‌ వక్కంతం వంశీ. కానీ అది కుదరలేదు. ఎన్టీఆర్‌ కూడా వక్కంతంతో తన నెక్ట్స్ సినిమా అని బహిరంగంగానే `జనతా గ్యారేజ్‌` సినిమా ఫంక్షన్‌లో ప్రకటించారు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్‌ సాటిస్పై కాకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. 

ఆ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు వక్కంతం వంశీ. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం చెందింది. ఇక అప్పట్నుంచి మరో సినిమా ఛాన్స్ రాలేదు. నిజం చెప్పాలంటే ఆయనతో సినిమా చేసేందుకు ఏ హీరో ఆసక్తి చూపలేదు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ హిట్‌ డైరెక్టర్‌కి వెంటనే సినిమాలు దొరకడం లేదు. హీరోల కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఫ్లాప్‌ డైరెక్టర్‌ సినిమా రావాలంటే చాలా కష్టం. వక్కంతం వంశీ పరిస్థితి కూడా అలానే ఉంది. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` పరాజయంతో ఆయనకు అవకాశాలు రావడం చాలా కష్టంగా మారింది. కానీ వంశీ మాత్రం ఎన్టీఆర్‌ పిలుపు కోసం ఇంకా వెయిట్‌ చేస్తూనే ఉన్నాడు. మరి అప్పుడు హ్యాండిచ్చిన ఎన్టీఆర్‌.. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తాడా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 

ఇప్పుడు ఎన్టీఆర్‌ వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తుండగా, ఆ తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. దీంతోపాటు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ సైతం ఎన్టీఆర్‌ కోసం ఓ కథ చెప్పాడు. ఇది కూడా దాదాపు ఓకే అయ్యింది. ఈ మూడు ప్రాజెక్ట్ లు పూర్తవ్వడానికి మరో మూడేళ్ళయ్యినా పట్టొచ్చు. దీంతో వక్కంతం వంశీతో సినిమా ఉంటుందా? లేదా అన్నది పెద్ద సస్పెన్స్. ఏదైనా మ్యాజిక్‌ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.