విలక్షణ నటుడు జగపతి బాబు.. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుంచి తప్పుకొన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టాలీవుడ్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. సినిమాలో విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌లను కీలక పాత్రల్లో ఎంపికచేశారు. 

అయితే కొన్ని కారణాల వల్ల జగపతిబాబు సినిమా నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను ఎంపికచేసినట్లు సమాచారం. ఈ విషయంపై స్వయంగా జగపతిబాబే ట్విట్టర్, యూట్యూబ్ వేదికగా అసలేం జరిగిందనే దానిపై  వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. చిత్ర పరిశ్రమ తన కుటుంబం లాంటిదని.. అలాంటి చిత్ర పరిశ్రమ గురించి బహిరంగంగా మాట్లాడడం తనకిష్టంలేదన్నారు.
 
జగపతిబాబు మాట్లాడుతూ...‘ నా 33 ఏళ్ల నా కెరీర్‌లో ఇలా ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం రాలేదు. మహేశ్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం నుంచి నేను తప్పుకున్నానంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి. వాటిలో ఎలాంటి వాస్తవంలేదు. వాటిని ఎవరూ నమ్మొద్దు. ఇప్పటికీ ఆ సినిమాలో క్యారక్టర్ అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికీ చేయమంటే ఆ క్యారక్టర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. 

ఆ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకున్నానన్నది కూడా నిజం. కానీ, చిత్ర పరిశ్రమలో కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో ఇదీ ఒకటి.. ఆ పరిస్థితుల కారణంగానే నేను ఆ సినిమాలో లేను. నేనా సినిమాను ఎంతో మిస్సవుతున్నాను. చిత్రయూనిట్ కి నా శుభాకాంక్షలు’ అని ఓ వీడియోలో జగపతిబాబు చెప్పుకొచ్చారు.
 
ఇక ప్రాజెక్టు నుంచి బయటికొచ్చిన విషయం నిజమేనని మాత్రమే ఒప్పుకున్న జగ్గుభాయ్ అసలు ఇలా  ఎందుకు రావాల్సి వచ్చింది..? షూటింగ్ సమయంలో  అసలేం జరిగింది..? తనను సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి కొన్ని పరిస్థితులు దూరం చేశాయి..? అని అంటున్న జగపతిబాబు ఆ పరిస్థితులేంటో మాత్రం చెప్పకపోవడం తో ఈ వ్యవహారంపై అభిమానుల్లో రకరకాల సందేహాలు వస్తున్నాయి. డౌట్లు పెరుగుతున్నాయి.

ఈ సినిమాలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. దిల్‌రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.