బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనను ఓ లేడీ కొరియోగ్రాఫర్ చెంప మీద కొట్టిందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ప్రధాన పాత్రలో నటించిన 'జీరో' సినిమా డిసంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా షారుఖ్ సినిమాకు సంబంధించిన విషయాలను విలేకరులతో పంచుకున్నారు. స్టార్ హోదాలో ఉండడం ఒత్తిడిగా ఉందా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. ఇన్నేళ్ల కెరీర్ లో రాజ్, రాహుల్, కుమార్ ఇలా అనేక పాత్రలో నటించా కానీ ఖాన్ గా మాత్రం ఎప్పుడూ నటించలేదు.. ఒత్తిడి ఎందుకు చెప్పండి..

దేవుడు నాకు ఎంతో పేరు ఇచ్చారు.. ఒత్తిడి ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గతంలో ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ''నా సినీ కెరీర్ ఆరంభంలో సరోజ్ ఖాన్(కొరియోగ్రాఫర్)గారితో కలిసి పని చేశాను. ఆరోజుల్లో మూడు షిఫ్ట్ లలో షూట్ కి హాజరయ్యేవాడ్ని.

దీంతో బాగా నీరసంగా అనిపించేది. అప్పుడు సరోజ్ గారితో చాలా ఎక్కువ పని చేసి అలసిపోయా.. అదే విషయాన్ని ఆమెకి చెబితే ఆమె ఓ తల్లిలా చొరవ తీసుకొని నా చెంపపై కొట్టారు. ప్రేమగా సలహా ఇచ్చారు'' అంటూ చెప్పుకొచ్చారు.