ఇటీవల సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో ఒకరి పేరుని వాడుకుని కొందరు సైబర్‌ దొంగల ముఠా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్నామంటూ, అర్జెంట్‌గా మనీ అవసరం అంటూ ఫ్రెండ్స్ పేర్లతో డబ్బులు వసూలు చేసే నేరగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు. సాధారణ వ్యక్తుల నుంచి, సెలబ్రిటీల వరకు దీనికి బాధితులుగా మారుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ విషయంలో అదే జరిగింది. ఆయన పేరుతో ఓ సైబర్‌ నేరగాడు డబ్బులు వసూలు చేయబోయిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. 

తాను సాయిధరమ్‌ తేజ్‌ని అని ,15000 కావాలని ఓ ఫ్రెండ్‌ని అడుగుతున్నట్టుగా ఓ వాట్సాప్‌ చాట్‌ని తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ పంచుకున్నారు. ఇలాంటి నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. `ఓ వ్యక్తి నాలా మారి, నాకు మనీ అవసరం ఉన్నట్టుగా మరో వ్యక్తిని డబ్బులు అడుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. దీనిపై నా తరపున నేను లీగల్‌ యాక్షన్స్ తీసుకున్నాను. ఇలాంటి వాటి నుంచి ప్రతి ఒక్కరు అవగాహనతో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కన్వర్జేషన్స్ కి దూరంగా ఉండండి` అని పేర్కొన్నారు. గతేడాది `సోలో బ్రతుకే సో బెటర్‌` చిత్రంతో ఆకట్టుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం `రిపబ్లిక్‌` చిత్రంలో నటిస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.