చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య నువ్వా నేనా అనే గొడవలు, అలాగే ఇగోలు సర్వసాధారణం. ప్రేక్షకులలో గుర్తింపు వచ్చాక, ఒక స్టార్ డమ్ తెచుకున్నాక  నేను ఎవరికి తక్కువా అనే భేదభావాలు మొదలవుతాయి. మీడియా ముందు, పబ్లిక్ వేదికలపై హీరోలు ఈ ఇగోలు చూపించనప్పటికీ లోలోపల మరియు సన్నిహితుల దగ్గర తమ గొప్పలు డప్పులు కొడుతూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఇప్పటిదికాదు వెండితెర రారాజులుగా వెలిగిన ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ మధ్య, ఎన్టీఆర్ మరియు కృష్ణ మధ్య ఇగో గొడవలు, విభేదాలు ఏర్పడ్డాయి. చాలా కాలం వీరు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉన్నారు. వీరి గొడవలు అప్పట్లో జనాలకు తెలియకపోయినా పరిశ్రమలో అందరికీ తెలుసు. 

ఐతే ఒక విశిష్ట వేదిక సాక్షిగా ఇద్దరు ప్రముఖులు బహిరంగ విమర్శలకు దిగారు. 2007లో తెలుగు చిత్ర పరిశ్రమ 75ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీనితో పరిశ్రమకు విశేష సేవలు అందించిన సీనియర్ నటులు, సాంకేతిక నిపుణులను సన్మానించుకోవడం జరిగింది. కోట్లు ఖర్చుబెట్టి అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుక అనేక విమర్శల పాలైంది. ఒకప్పుడు వెండితెరపై వెలిగిన  ఆర్టిస్ట్స్ మరియు కమెడియన్స్ కి కనీసం ఆహ్వానం అందలేదు. గతాన్ని మరచి ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చాలాయిస్తున్న వారికి అగ్రతాంబూలం ఇచ్చారు. 

ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ వేదికపై ఓ అవార్డు విషయంపై మోహన్ బాబు చేసిన వాడివేడి ప్రసంగం ఒక ఎత్తు. చిరంజీవికి లెజెండరీ యాక్టర్ అవార్డు ఇచ్చి, తనకు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 500లకు పైగా సినిమాల్లో నటించిన నేను చిరంజీవి కంటే ఎందులో తక్కువా అని వేదిక సాక్షిగా ప్రశ్నించారు. మోహన్ బాబు వ్యాఖ్యలకు చిరు ఫ్యామిలీ మొత్తం ఫైర్ అయ్యారు. అంత పెద్ద వేడుకలో చిరంజీవి, పవన్ కూడా సంయమనం కోల్పోయి మోహన్ బాబుపై విమర్శలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే సవాళ్లు విసురుకున్నారు. 

ఇది కొన్నాళ్ళు టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఈ వేడుక తరువాత చిరు మరియు మోహన్ బాబు బాగా దూరం అయ్యారు. అది జరిగి దాదాపు 13ఏళ్ళు అవుతుంది. ఐతే  కొన్నాళ్లుగా మోహన్ బాబు, చిరు సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరిని ఒకరు విష్ చేసుకోవడం, నువ్వులేక నేను లేనట్లు ఉంటున్నారు . కొన్ని వేదికలపై వీరి కలిసి కనిపించడంతో పాటు కౌగిలింతలు ముద్దులతో రెచ్చి పోతున్నారు. ఇది మంచి పరిణామమే, వారు సన్నిహితంగా  మెలగడం అందరూ హర్షించే విషయమే. కానీ వీరిద్దరిని దగ్గర చేసిన అంశం, ఆ ప్రయోజనం ఏమిటనేది ఇక్కడ ఎవరికీ అర్థం కానీ విషయం.