సైరా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి కొద్ది రోజులు పాటు కేరళలలో గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ లో పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి సైరా కోసం చిరంజీవి బరువు పెరిగారు. అయితే కొరటాల శివ సినిమాలో చిరంజీవి స్లిమ్ గా కనిపించనున్నారని, ఈ క్రమంలోనే బరువు తగ్గాలని కొరటాల చిరంజీవికి సూచించారని  వార్తలు వస్తున్నాయి.  కొరటాల శివతో సినిమా ఆగస్టులో ప్రారంభం అయ్యి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మార్చి 25, 2020 ఉగాది స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. 

చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్ ఎవరన్నదే ఇంకా తేలలేదు. పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించినా తాజాగా శ్రుతిహాసన్‌ని, నయనతార ను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు సమాచారం. చిరు సరసన నటించే ప్రధాన హీరోయిన్ కోసమే నయనతారని సంప్రదించారని చెప్తున్నారు.  శ్రుతి హాసన్ ని మరో కీలక పాత్ర కోసమా అన్నట్లు చెప్తున్నారు. ‘కాటమరాయుడు’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు శ్రుతి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’లో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.  ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీసేందుకు చిరు, కొరటాల సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తున్నారు.