Vyooham Trailer: వ్యూహం ట్రైలర్... నా స్టేట్మెంట్ మీకు కాదు, మిమ్మల్ని పంపించినోళ్లకు!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ వ్యూహం. విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేశారు.
రాజకీయాల్లో వైఎస్ జగన్ పెను సంచలనం అనడంలో సందేహం లేదు. ఆయన పొలిటికల్ జర్నీని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం జగన్ బయోపిక్ గా తెరకెక్కింది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా తయారయ్యాడు. ఢిల్లీ పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర ట్రెమండస్ సక్సెస్ అయ్యింది.
అప్పుడే సీబీఐ రంగంలోకి దిగింది. జగన్ పొలిటికల్ కెరీర్ పై ఉక్కుపాదం మోపే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన జగన్ ఏకంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత పాదయాత్ర, సీఎం పీఠం అధిరోహించడం వంటి సంఘటనలు వ్యూహం మూవీలో చోటు చేసుకోనున్నాయి. అయితే జగన్ అరెస్ట్ వెనుక చంద్రబాబు హస్తం కూడా ఉందని వ్యూహం చిత్రంలో చెప్పే ప్రయత్నం జరిగింది.
అలాగే జనసేన ప్రస్తావన ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని వాడుకుని వదిలేశాడని చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వెనుక కారణాలు కూడా వ్యూహం మూవీలో చెప్పినట్లు ట్రైలర్ ఉంది. ఊహించినట్లే ఏపీ సీఎం జగన్ కి అనుకూలంగా ప్రత్యర్థులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా ఇమేజ్ దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయి. మొత్తంగా వర్మ మార్క్ కాంట్రవర్సియల్ పోలికలు డ్రామాగా వ్యూహం ఉండనుంది.
వ్యూహం నవంబర్ 10న విడుదల కానుంది. అలాగే దీనికి మరొక పార్ట్ శబధం కూడా ఉంది. జగన్ పాత్రలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. జగన్ భార్య పాత్ర మానస రాధాకృష్ణన్ చేశారు.