కరోనా వైరస్ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బయటకు రావడం చాలా భయంగా ఉంది. ఈ నేపధ్యంలో ప్రపంచం మొత్తం కరోనాకు మందు కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపద్యంలో సంచలన చిత్రాల దర్శకుడు వి.వి వినాయక్ ..కరోనాకు ఓ ఇంజక్షన్ ని సూచించారు. కరోనాకు  ఆ ఇంజెక్షన్ తో చెక్‌ పెట్టడం సాధ్యమౌతుందేమో అనే ప్రయత్నించమంటూ సలహా ఇచ్చారు. ఈ మేరకు వివి వినాయక్‌ ఒక వీడియోను విడుదల చేశారు. 

వినాయిక్ మాట్లాడుతూ, "ఓసారి కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునే క్రమంలో ఎల్లో ఫీవర్ లక్షణాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం." అని వీవీ వినాయక్‌ అన్నారు.  

ఇదిలా వుండగా ఈ మధ్య కరోనా నివారణకు సంబంధించి ఇద్దరు వైద్యులు మాట్లాడుకున​ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో కరోనా వైరస్ శరీరంలో ఎలా వ్యాపిస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఉన్నాయి. ఆ ఆడియో క్లిప్ విన్న వినాయక్ వాళ్లకు తన ఆలోచన చేరాలనే ఉద్దేశంతోనే వీడియో షేర్‌ చేసినట్లు తెలిపారు.  ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి ఆ వైద్యులకు చెప్పడమే తన ఉద్దేశమని వినాయక్‌ తెలిపారు. అది ఏమైనా కరోనా నివారణకు పనికొస్తుందేమో ఒకసారి పరీక్షించాలని వినాయక్‌ కోరారు.