ఆదివారం రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య రామోజీ ఫిలిం సిటీలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రాజమౌళి, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, వివి వినాయక్ ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. 

వివి వినాయక్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ సాహో చిత్రం సాధించబోయే వసూళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాహో తొలి రోజు ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి2కి తొలి రోజు హిందీలో 40 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇప్పటివరకు అదే హైయెస్ట్ అని విన్నట్లు వివి వినాయక్ తెలిపారు. 

సాహో చిత్రం తొలిరోజు హిందీలో 50 కోట్లకు పైగా షేర్ సాధిస్తుంది. ప్రభాస్ హిందీలో కూడా పెద్ద స్టార్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని వివి వినాయక్ తెలిపారు. ప్రభాస్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. రాబోవు రోజుల్లో 2000 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ సినిమా తీయాలి. తెలుగు సినిమా స్థాయిని పెంచాలి అని వినాయక్ కోరారు. 

వినాయక్, ప్రభాస్ కాంబినేషన్ లో 'యోగి' చిత్రం తెరకెక్కింది. ఇక సాహో చిత్రంలో సౌత్ ఇండియన్ నటులతో పాటు బాలీవుడ్ తారలు కూడా నటిస్తున్నారు. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఐటెం సాంగ్ లో హీటెక్కించింది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.