స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ నుంచి వచ్చిన ఎన్నో మాస్ చిత్రాలు అలరించాయి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకీ, రవితేజ లాంటి టాప్ హీరోలందరికీ వినాయక్ సూపర్ హిట్స్ అందించారు. అలాంటి వివి వినాయక్ కు కూడా ఓ సందర్భంలో ఇండస్ట్రీని వదిలేద్దామని అనిపించిందట. 

ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన 'రాగాల 24 గంటల్లో' చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో వివి వినాయక్ పాల్గొన్నారు. వినాయక్ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని వినాయక్ తెలిపారు. కెరీర్ ఆరంభంలో చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం మద్రాసులో ఉన్న సమయంలో.. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగలేనని అనిపించింది. ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా. 

ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సలహా తనలో నమ్మకాన్ని పెంచిందని వివి వినాయక్ అన్నారు. చిత్ర పరిశ్రమలో నీవు చాలా సాధించగలవు అని చెప్పారు. ఇక 'రాగాల 24 గంటల్లో' చిత్రం గురించి మాట్లాడుతూ.. టైటిల్ వినగానే రేడియోలో వచ్చే వార్తలు గుర్తుకు వచ్చాయి. 

మంచి స్క్రిప్ట్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తారు. డమరుకం చిత్రమే అందుకు ఉదాహరణ అని వినాయక్ తెలిపారు. ఈ చిత్రంలో ఇషా రెబ్బా, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.