కరోనా తరువాత షూటింగ్ లు తిరిగి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలంత కలుసుకొని చర్చలు జరిపారు. తరువాత ప్రభుత్వానికి కూడా తమ వాదన వినిపించటంతో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే షూటింగ్‌లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ హామీ ఇచ్చారు.

అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మీటింగ్‌లకు తనను ఆహ్వానించలేదంటూ అసహనం వ్యక్తం చేసిన బాలయ్య, తలసానితో కలిసి ఇండస్ట్రీ పెద్దలు భూములు పంచుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ వర్గాలను గట్టిగానే కౌంటర్‌లు పడ్డాయి. సీ కళ్యాణ్, నాగబాబు, తమ్మారెడ్డి లాంటి వారు బాలయ్య వ్యాఖ్యలను తప్పు పట్టారు.

అయితే ఈ నేపథ్యంలో సీ కళ్యాణ్ మాట్లాడుతూ హీరోలను ఆహ్వానించాల్సిన బాధ్యత మా అసోసియేషన్‌దే అనటంపై మరో వివాదం మొదలైంది. ఈ విషయంపై స్పందించిన మా అధ్యక్షుడు నరేష్‌, నాకు మా ప్రధాన కార్యదర్శికి కూడా ఈ మీటింగ్‌కు సంబంధించిన విషయం తెలియదని చెప్పాడు. మాకే తెలియని పక్ష్యంలో మేం ఇతర నటీనటులను ఎలా ఆహ్వానిస్తాం అని ప్రశ్నించాడు. ఈ వివాదంలో కొంత మంది చిరంజీవి వర్గం, మరికొంత మంది బాలయ్య వర్గంగా చీలిపోయారు. ఈ వివాదం ముందు ముందుకు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.