సారాంశం

`సౌండ్‌ పార్టీ`తో సౌండ్‌ చేసేందుకు వస్తున్నారు బిగ్‌ బాస్‌ 5 విన్నర్‌, వీజే సన్నీ. తాజాగా ఆయన ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టారు. ఒక్కసారిగా బాంబ్‌ పేల్చారు.

బిగ్‌ బాస్‌ తెలుగు ఐదవ సీజన్‌తో పాపులర్‌ అయ్యారు వీజే సన్నీ. తనదైన ఆటతో రఫ్ఫాడించారు. ఆ వెంటనే ఆయన హీరోగా పలు క్రేజీ ఆఫర్లని అందుకున్నారు. ఇప్పటికే రెండు సినిమాల్లో మెరిసిన ఆయన ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రాబోతున్నారు. `సౌండ్‌ పార్టీ` అనే చిత్రంలో హీరోగా నటించారు. సంజయ్‌ శౌరి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 24న విడుదల కాబోతుంది. 

`సౌండ్‌ పార్టీ` సినిమా ప్రమోషన్స్ లో సన్నీ పాల్గొన్నారు. ఇందులో ఆయన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. జర్నలిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన హీరోగా కావాలని కలలు కన్నారు. వీజేగా చేస్తుండగానే హీరోగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో `హ్యాపీడేస్‌` సినిమా ఆడిషన్‌ కి కూడా వెళ్లారట. ఆ సమయంలో ఆడిషన్‌లో.. ఆఫర్‌ కావాలంటే 25 లక్షల కట్టాలని డిమాండ్‌ చేశారట. అంత స్థోమత లేక దాన్ని వదులుకున్నట్టు చెప్పారు సన్నీ. 

ఈ క్రమంలో తాను చాలా స్ట్రగుల్‌ అయినట్టు చెప్పారు. సీరియల్స్ లోనూ నటించారు. అట్నుంచి స్ట్రగుల్‌ అవుతూ హీరోగా అవకాశాలు అందుకున్నారు. అదే సమయంలో బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యారు. టైటిల్‌ విన్నర్‌గా ఆయనకు మంచి క్రేజ్‌ వచ్చింది. హీరోగా సినిమాలు చేశారు. గత చిత్రం `అన్‌స్టాపబుల్‌` వర్కౌట్‌ కాలేదు. దీంతో ఇప్పుడు `సౌండ్‌ పార్టీ`ని పక్కగా దగ్గరుండి చూసుకున్నారట. గత మిస్టేక్స్ జరగకుండా తాను కేర్‌ తీసుకున్నారని, దగ్గరుండి సినిమా చేశానని తెలిపారు. అన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారట. చెప్పిన కథ, తెరపై వచ్చే విషయంలోనూ జాగ్రత్త పడ్డట్టు తెలిపారు. `సౌండ్‌ పార్టీ` సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని, డిజప్పాయింట్‌ చేయదని ఆయన వెల్లడించారు. 

సినిమా పూర్తి ఫన్‌ రైడ్‌లా ఉంటుందట. ఇద్దరు అతి తెలివైన తండ్రీకొడుకుల కథ అని, డబ్బు సంపాదించేందుకు వాళ్లు పడే పాట్లు, వాళ్లు చేసే చేష్టలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయన్నారు. ఇందులో బిట్‌ కాయిన్‌ మ్యాటర్‌ కూడా ఉంటుందన్నారు. అది హిలేరియస్‌గా ఉంటుందని తెలిపారు. అలాగే ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఉందని వెల్లడించారు. 

ఇక `అన్‌స్టాపబుల్‌` ప్రెస్‌మీట్‌లో తాను రివ్యూలపై ఫైర్‌ అయిన విషయం చెబుతూ, ఒక వ్యక్తి సినిమా చూడకుండా రివ్యూ రాశారనేది తన బాధ అని, ఆ వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే తాను మాట్లాడానని, మిగిలిన వారి గురించి కాదన్నారు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి విమర్శ ఉండదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. ఇకపై కూడా ఒక్కో సినిమా చాలా కేర్‌గా చేసుకుంటానని, హడావుడిగా రెండు మూడు సినిమాలు చేయనని తెలిపారు. `సౌండ్‌ పార్టీ` రిజల్ట్ తర్వాతే నెక్ట్స్ సినిమా ప్లాన్‌ చేస్తానని తెలిపారు సన్నీ. ఇందులో హృతిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటించగా, రవి పొలిశెట్టి, రవీంద్ర గజేంద్ర నిర్మించారు.