2005లో విడుదలై 804 రోజులు ఆడి రికార్డు సృష్టించిన ‘చంద్రముఖి’ సినిమా వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కన్నడలో విష్ణువర్ధన్ ‘హౌలా హౌలా’ అంటే, రజనీకాంత్ ‘లకలక’ అనడం వెనుక కథేంటి?
భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘చంద్రముఖి’ (2005) సినిమా గురించి ఇప్పుడు పలు అరుదైన విషయాలు వైరల్ అవుతున్నాయి. కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా వచ్చిన ‘ఆప్తమిత్ర’ సినిమా హిట్ అయ్యాక తమిళంలో తీసిన ‘చంద్రముఖి’లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు గురించి తెలుసుకుందాం.
‘నాగవల్లి’ కాస్తా ‘చంద్రముఖి’గా... ‘హౌలా హౌలా’ కాస్తా ‘లకలక’గా
కన్నడలో డా. విష్ణువర్ధన్ ‘హౌలా హౌలా’ అనే మ్యానరిజాన్ని వాడారు. అయితే తమిళంలో అంతకంటే పవర్ఫుల్ మ్యానరిజం కావాలని అనుకున్నారు. అందుకే ‘నాగవల్లి’ పేరును మార్చి, మరింత అద్భుతంగా ఉండేలా ‘చంద్రముఖి’ అని పెట్టారు. ఇక రజనీకాంత్ చిన్నప్పుడు ఒక మరాఠీ నాటకంలో నటిస్తున్నప్పుడు వాడిన ‘లకలక లకలక’ అనే క్యాచి వర్డ్‌ను ఈ సినిమాలో వాడుకున్నారు. అదే సినిమాకు హైలైట్ అయింది.
సిమ్రాన్ 3 రోజుల షూటింగ్ చేశాక జ్యోతిక ఎంట్రీ!
చంద్రముఖి పాత్ర కోసం ముందుగా స్నేహ, సిమ్రాన్, రీమా సేన్ పేర్లను అనుకున్నారు. చివరకు సిమ్రాన్‌ను ఫైనల్ చేశారు. రజనీకాంత్ పక్కన నయనతార నటిస్తుండగా, సిమ్రాన్‌తో కూడా 3 రోజుల షూటింగ్ పూర్తయింది. కానీ అప్పుడే సిమ్రాన్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఈ సినిమాకు ఎక్కువ రోజులు కాల్ షీట్స్ కావాలి కాబట్టి, ఆమె కంటిన్యూ అవ్వలేకపోయారు. ఇక జ్యోతిక రాసిపెట్టి ఉందేమో, ఆ పాత్ర ఆమెను వరించింది. జ్యోతిక కూడా ఆ పాత్ర చేయడానికి చాలా ఆసక్తి చూపించడంతో ‘చంద్రముఖి’గా అదరగొట్టేసింది.
తెలుగు రీమేక్ మిస్ అయ్యి, డబ్బింగ్లోనూ రికార్డ్!
ఒరిజినల్ మలయాళ సినిమా ‘మణిచిత్రతాజు’ హీరోయిన్ శోభన, అంతకుముందు తెలుగులో ‘మిస్టర్ పెళ్లాం’, ‘శ్రీకారం’ చిత్రాలను నిర్మించిన పార్థసారథికి ఆ సినిమా డీవీడీ ఇచ్చి, "ఇది చాలా బాగుంది, తెలుగులో రీమేక్ చేయండి" అని సూచించారట. కానీ ఆయన ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి, రమేష్ బాబు కలిసి తమిళ ‘చంద్రముఖి’ని తెలుగులో డబ్ చేశారు. తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమా రేంజ్లో వసూళ్ల వర్షం కురిపించింది.
1944 నాటి రికార్డును బద్దలుకొట్టి 804 రోజుల ప్రదర్శన
చెన్నైలోని శివాజీ గణేశన్ సొంత థియేటర్ అయిన ‘శాంతి థియేటర్’లో ‘చంద్రముఖి’ సినిమా ఏకంగా 804 రోజులు ఆడింది. అంతకుముందు 1944లో త్యాగరాజ భాగవతార్ నటించిన ‘హరిదాస్’ సినిమా 768 రోజులకు పైగా ఆడిన రికార్డును 2005లో రజనీకాంత్ ‘చంద్రముఖి’ బ్రేక్ చేసింది.















