"బయిట కొంచెం మాట్లాడుతున్నారు..ఆల్రెడీ ఒకడ్ని లేపినం..నెత్తి మీద పెట్టుకున్నాం...మళ్లీ వీడిని లేపితే మళ్లీ వీడు నెత్తి మీద కూచుంటాడు అని...అన్నా సారీ నేనే డబ్బులు పెట్టుకున్నా...నేనే డైరక్షన్ చేసుకున్నా...నేనే సినిమా తీసుకున్నా...నన్ను ఎవరూ లేపే అవసరం లేదు.. నన్ను నేను లేపుకుంటా...మళ్లా మళ్లా లేపుకుంటా.." అంటూ చెప్పుకొచ్చారు హీరో విశ్వక్‌ సేన్‌.

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. కరాటే రాజు సమర్పణలో విశ్వక్‌ సేన్‌ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్‌ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో విశ్వక్ సేన్  మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అయితే ఆల్రెడీ ఒకడ్ని లేపినం..నెత్తిన పెట్టుకున్నాం అనే మాటలు విజయ దేవరకొండని ఉద్దేశించి అన్నవే అందరికీ అర్దమైంది. అయితే విశ్వక్ సేన్ స్టేజీపై ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందనేది మాత్రం ఎవరికీ అర్దం కాలేదు. విజయ్ దేవరకొండ తన నటనతో తన హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో అయ్యారు. అందులో సందేహం ఏ మాత్రం లేదు. ఫ్లూక్ ఏ మాత్రం లేదు. 

విశ్వక్‌ సేన్‌ కంటిన్యూ చేస్తూ..– ‘‘సినిమా నేపథ్యం లేకున్నా సినిమాల్లోకి రావచ్చనే ధైర్యం నానీ అన్న వల్లే వచ్చింది. నేను డైరెక్షన్‌ చేస్తున్నప్పుడు అందరూ భయపెట్టారు. నాకు ఎలానూ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. ఏదైనా జరిగితే బ్యాగ్‌ సర్దుకుని వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అలా జరగదనే ఈ సినిమా తీశా. టీజర్‌కే బ్యాగ్‌ ప్యాక్‌ చేసుకునే చాన్స్‌  లేకుండా చేశారు’’ అన్నారు.