కమర్షియల్ చిత్రాలలో హీరోల డాన్స్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. తెరపై తమ అభిమాన హీరో డాన్స్ చేస్తుంటే థియేటర్ లో కూర్చునే ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. అందుకే మన స్టార్ హీరోలు డాన్స్ ల కోసం చాలా కష్టపడుతుంటారు. తాజాగా హీరో విశాల్ కొన్ని కష్టమైన స్టెప్స్ కోసం ప్రయత్నిస్తూ షూటింగ్ లో గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విశాల్ హీరోగా 'అయోగ్య' అనే సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో వచ్చిన 'టెంపర్' సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ 'సరైనోడు'లో ఉన్న 'బ్లాక్ బస్టర్' సాంగ్ ని వాడుకుంటున్నారు. ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ని అంత ఈజీగా మర్చిపోలేం. 

డాన్స్ కి స్కోప్ ఉన్న పాట కావడంతో విశాల్ కూడా కష్టమైన స్టెప్స్ వేయడానికి రెడీ అయ్యాడట. అయితే ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడట. మోచేయి వాయడంతో పాటు కాలికి కూడా గాయమయిందట. దీంతో ఈ పాట చిత్రీకరణను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

విశాల్ కోలుకున్న తరువాత సినిమా షూటింగ్ పూర్తి చేస్తారు. ఈ సినిమాలో విశాల్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను విశాల్, జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.