విశాల్ నామినేషన్ పై మళ్లీ కొత్త ట్విస్ట్

vishal fights against rejection of his nomination for rk nagar
Highlights

  • ఆర్ కె నగర్ ఉపఎన్నికల బరిలో విశాల్ నామినేషన్
  • విశాల్ నామినేషన్ తిరస్కరించిన ఈసీ
  • ఆందోళనతో తిరిగి ఓకే చేసి మళ్లీ తిరస్కరించిన ఈసీ
  • ఆర్ కె నగర్ లో జరుగుతున్న కుళ్లు రాజకీయాలు రికార్డ్ చేసి నిరూపించిన విశాల్

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కె నగర్ ఉపఎన్నికల బరిలో నిలుస్తూ తమిళ హీరో విశాల్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది. ఆర్ కె నగర్ ఉపఎన్నికల బరిలో ఈసీ తన నామినేషన్ తిరస్కరించడంపై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కోర్టులోనే తేల్చుకుంటానని చెప్తున్నాడు.

 

ఆర్.కె,.నగర్ ఉపఎన్నికల్లో తమిళ హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణతో విశాల్ షాక్ కు గురయ్యాడు. తాను ఫోర్జరీ సంతకాలతో ప్రపోజర్స్ ను తెచ్చినట్టుగా ఆరోపిస్తూ ఎన్నికల సంఘం విశాల్ నామినేషన్ తిరస్కరించింది. నామినేషన్ వేసిన తొలిరోజే ఊహించని ఈ పరిణామంతో షాక్ కు గురైన విశాల్ తేరుకుని పోరాటం మొదలుపెట్టాడు. తాను కోర్టుకు వెళ్లయినా విశాల్ దీనిపై తేల్చుకుంటానని అంటున్నారు.

 

తాను ఎవరినీ బెదిరించలేదని, కుట్రతో ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించారని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు విశాల్. అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్మాకు దిగటంతో సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ తిరస్కరించడంలో ఆంతర్యమేంటో తనకు అర్థం కావటంలేదని విశాల్ ఆరోపిస్తున్నారు. అన్నీ సరిగ్గానే వున్నాయని, కావాలనే నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. తనకు ఫోర్జరీ ప్రపోజల్స్ తెచ్చుకోవాల్సినంత అవసరం లేదన్నాడు.

 

పైగా తనకు ప్రపోజల్ ఇచ్చిన సుమతి భర్త వేలుతో ఫోన్ కన్వర్ జేషన్ రికార్డు చేసిన విశాల్ దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. సుమతిని భయబ్రాంతులకు గురిచేసి మభ్యపెట్టడం వల్లనే రిటర్నింగ్ అధికారికి ఫోర్జరీ గురించి చెప్పింది తప్ప నిజం లేదని సినీఫక్కీలో విశాల్ నిరూపించాడు. కానీ సినిమాల్లో అయితే హీరో గెలుస్తాడు. ఇక్కడ మాత్రం విశాల్ నామినేషన్ ఆమోదం పొందలేదు. తొలుత అంగీకరించి మళ్లీ తిరిగి తిరస్కరించడం కుట్ర కాక మరేంటని విశాల్ ప్రశ్నిస్తున్నాడు.

 

సోమవారం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లిన విశాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. విశాల్‌.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్‌ ప్రజలను కోరాడు. కాగా జయ కోడలు దీప సహా మొత్తం 73 మంది నామినేషన్లు తిరస్కరించింది ఈసీ.

 

డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ(శశికళ) పార్టీ తరపున  దినకరన్‌, బీజేపీ తరపున అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు తమిళనాట క్రేజ్‌ సంపాదించుకున్న మాస్‌ హీరో విశాల్‌  బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందనుకుంటే విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అంతేకాక జయ మేనకోడలు దీప నామినేషన్ కూడా తిరస్కరించడంతో ఉపఎన్నిక క్షణక్షణం రసవత్తరంగా మారుతోంది. తనపై అనర్హత వేటు వేయటానికి కారణాలు అర్థం కావట్లేదని, దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని విశాల్ స్పష్టం చేశారు. తను ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించాడు. డిసెంబర్ 5,2016న అమ్మ చనిపోగా, డిసెంబర్ 5,2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విశాల్ ట్వీట్ చేశాడు.

loader