విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగులకు భజరంగ్‌దళ్ కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే సాయిపల్లవిపై భజరంగ్ దళ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీంయాశంగా మారింది.
రానా దగ్గుబాటి (rana daggubati), సాయి పల్లవి జంటగా నటించిన ‘‘విరాట పర్వం’’ సినిమా (Virataparvam) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కోవిడ్, లాక్‌డౌన్, తదితర కారణాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని అవాంతరాలను దాటుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగులకు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. భజరంగ్‌దళ్ కార్యకార్తలు తనను బెదిరిస్తున్నారంటూ వేణు ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. సినీనటి సాయిపల్లవిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫైరయ్యారు. ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెపై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు భజరంగ్ దళ్ నేతలు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు.. గో రక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సాయిపల్లవిపై వారు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు వీడియో పరిశీలించి తగిన చర్చలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాగా.. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన పర్సనల్ విషయాలతో పాటు, సినిమా విషయాలను షేర్ చేసుకుంది. నక్సల్ గురించి చెప్పే క్రమంలో విషయం ‘కశ్మీర్ ఫైల్స్’ Kashmir Files వైపు మళ్లింది. దీంతో అనుకోని వివాదంలో చిక్కుకుంది. మనుషుల ఆలోచనలు మారాలనే ఉద్దేశంతో సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘వాళ్లది ఒక ఐడియాలజీ.. మనకు శాంతి అనేది ఓ ఐడియాలజి. నాకు ఘర్షణలు నచ్చవు. న్యూట్రల్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఏ విషయంలోనూ ఏవరిదీ పూర్తిగా తప్పు అని చెప్పలేం. పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నారు. మనకు వాళ్లు కూడా అలానే కనిపిస్తారు. ఏదీ తప్పు ఏది ఒప్పు అని చెప్పడం కష్టం.
ALso Read:కాశ్మీర్ ఫైల్స్‌పై వ్యాఖ్యలు.. సినీనటి సాయిపల్లవిపై భజరంగ్‌దళ్ కార్యకర్తల ఫిర్యాదు
మా కుటుంబం లెఫ్ట్, రైట్ అని ఉండదు. నేను వీటి గురించి తెలుసుకున్నాను. కానీ నేను ఏ భావజాలాన్ని కలిగి లేను. కొన్ని రోజుల కింద వచ్చి కాశ్మీర్ ఫైల్స్ లో పండిట్స్ ను ఎలా చంపారో చూశాం. అలాగే ఆ మధ్యలో బండిలో ఓ ముస్లిం డ్రైవర్ ఆవును తరలిస్తుండగా.. కొంత మంది కొట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు కాశ్మీర్ పండిట్స్ హత్యలకు, గో హత్యలకు ఎలాంటి తేడా లేదు. అందరూ న్యూట్రల్ గా ఆలోచించడం నేర్చుకోవాలంటూ.. చెప్పుకొచ్చింది.
దీంతో ఇప్పటి వరకు లేడీ పవర్ స్టార్ అంటూ తనను కొనియాడిన కొందరు నెటిజన్స్ ఆమె ముస్లింలకు సపోర్ట్ గా మాట్లాడిందనే ఉద్దేశంతో విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ‘విరాట పర్వం’ సినిమాను చూడబోమంటూ నెట్టింట బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. #BycottSaipallavi, #BycottVirataparvam అనే హ్యాష్ ట్యాగ్స్ తో ట్విటర్ లో వార్ చేస్తున్నారు. ఇది పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
