‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ లో చేరారని చూపించడంపై తీవ్ర వివాదం చెలరేగింది.
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. ది కేరళ స్టోరీ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించడంతో ఇప్పటికే సినిమా 56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు ‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ లో చేరారని చూపించడంపై తీవ్ర వివాదం చెలరేగింది.
'ది కేరళ స్టోరీ' సినిమా కథ ఇస్లాం మతంలోకి మారిన మహిళల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ లో కేరళకు చెందిన 32,000 మందికి పైగా మహిళలు ఐసిస్ లో చేరినట్లు చూపించారు మేకర్స్. ఆ తర్వాత ఈ సంఖ్యను మూడుకి మార్చారు. ఈ మార్పుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని గణాంకాలపై నిర్మాత విపుల్ షా స్పందించారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత విపుల్ షా స్పందించారు. నెంబర్ ముఖ్యం కాదు కథ ముఖ్యం అన్నారు.
విపుల్ షా మాట్లాడుతూ...“'ది కేరళ స్టోరీ' సినిమా ద్వారా కేరళలో జరుగుతున్న ఉగ్ర వ్యాప్తి గురించి తెలియజేయాలి అనుకున్నాం. ఇప్పటికే కేరళ నుంచి పలువురు యువతులు ఐసిస్ లో చేరారు. వారిలో కొందరు మతం మారిన యువతులు ఉన్నారు. సినిమాలో చూపించిన యువతుల సంఖ్యను చాలా మంది వివాదం చేస్తున్నారు. 32 వేలా? 32 మందా? అనేది అసలు విషయం అదికాదు. అక్కడి యువతులు ఉగ్రవాదం వైపు తరలించబడుతున్నారా? లేదా? అనేది ముఖ్యం. ఈ సినిమా ద్వారా మేము ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకున్నాం. తీసుకెళ్లాం కూడా” అని వివరించారు.
కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు సుదీప్తోసేన్. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మాత.
ఇక చిత్రయూనిట్ మే 12న ది కేరళ స్టోరీ సినిమాను మరో 37 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంకా ఏయే దేశాల్లో రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు. అమెరికా, ఆస్ట్రేలియా , బ్రిటన్ తో పాటు పలు దేశాల్లో ది కేరళ స్టోరీ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ దేశాల్లో సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
