ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `ప్రాజెక్ట్ కే` సినిమాలో భారీ వాహనాల కోసం టైర్లని డిజైన్‌ చేసిన వీడియోని విడుదల చేశారు. ఆ టైర్‌ని రూపొందించేందుకు ఎంత శ్రమించారో చూపించారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.  

ప్రభాస్‌ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం, టాలీవుడ్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ `ప్రాజెక్ట్ కే`. `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి టార్గెట్‌గా థియేటర్‌లోకి రాబోతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్‌లు తప్ప ఫస్ట్ లుక్‌లు రాలేదు. ఆ మధ్య సినిమాలో భారీ వాహనాల కోసం టైర్లని డిజైన్‌ చేసిన వీడియోని విడుదల చేశారు. ఆ టైర్‌ని రూపొందించేందుకు ఎంత శ్రమించారో చూపించారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

ఈ సారి విలన్‌ గెటప్ లను రివీల్‌ చేశారు. అసలు `ప్రాజెక్ట్ కే`లో విలన్లని ఏమంటారు, వారి గెటప్‌లు ఎలా ఉంటాయో అందుకోసం చేసిన కసరత్తులను లేటెస్ట్ వీడియోలో పంచుకున్నారు. `స్క్రాచ్‌ ఎపిసోడ్‌ 2- రైడర్స్ ఎవరు?` పేరుతో ఈ వీడియోని విడుదల చేశారు. ఇందులో రైడర్స్ ఎవరు అనే ప్రశ్నతో ఈ వీడియో ప్రారంభమైంది. చివరగా విలన్ల ఆర్మీ అని తేల్చారు. వారు ఎలా ఉంటారనే ప్రశ్నతో వారి ధరించే గెటప్‌ సూట్‌లను తయారు చేశారు. అంతిమంగా, స్టార్‌ వార్స్, అవెంజర్స్ లోని విలన్లని పోలినట్టుగా `ప్రాజెక్ట్ కే`లో విలన్ ఆర్మీ పాత్రలను డిజైన్‌ చేయడం విశేషం. బ్లాక్‌ సూట్‌లో విలన్లు ఉంటారని తెలుస్తుంది. అలా ఈ సినిమాలో విలన్‌ పాత్రధారులు ఎలా ఉంటారనేదానిపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే వాటికోసం ప్రత్యేకమైన టీమ్‌ వారి సూట్‌లను తయారు చేయడం విశేషం. 

ఇక `ప్రాజెక్ట్ కే` అర్థం ఏంటనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. కే అంటే కృష్ణ, లేదా కర్ణ అనే అర్థంలో ఉంటుందట. మైథలాజికల్‌ అంశాలకు, సూపర్‌ మేన్‌ అంశాన్ని జోడించి టైమ్‌ ట్రావెలర్‌ కాన్సెప్ట్ తో ఈ సినిమాని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నారట. అంతేకాదు దీన్ని ఐదారు పార్ట్ లుగా (సిరీస్‌)లాగా తెరకెక్కించాలనుకుంటున్నారట. ఓ యూనివర్స్ తరహాలోనే `ప్రాజెక్ట్ కే`ని తీసుకురాబోతున్నారట దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అయితే తాజాగా విడుదల చేసిన వీడియో చివర్లో ఇతర గ్రాహాలపై సంచరిస్తున్నట్టుగా చూపించడం మరింత ఉక్కంఠతకి గురి చేస్తుంది. ఆ సీక్రెట్‌ ఏంటనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

YouTube video player

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ఐదువందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతుంది. ఇతర దేశాల్లోనూ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 12న సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు.