గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్లాస్మా ట్రీట్‌మెంట్‌తోపాటు ఎక్మో పై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. విదేశీ వైద్యుల సలహాలతో ఆయనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది.  ప్రస్తుతం కూడా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. కానీ బాలు ఆరోగ్యం ఆందోళనకంగానే ఉందనిపిస్తుంది. 

ఈ నేపథ్యంలో అనేక మంది సినీ తారలు స్పందించి ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని, త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి స్పందించారు. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. కచ్చితంగా బాలు కోలుకుని వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని విజయశాంతి పంచుకున్నారు. 

బాలు తన 54ఏళ్ళ కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజల కారణంగా బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నానని తెలిపారు. దక్షిణాది సినిమా పాటలకు బాలు ఓ బ్రాండ్‌ నేమ్‌ అనడం అతిశయోక్తి కాదు. డాన్స్ రాని వారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి, మ్యూజిక్‌ తెలియని వారిలో కనీసం హమ్మింగ్‌ చేయించే పవర్‌ బాలు పాటకు ఉందన్నారు. 

రెండు తరాల జీవితాలు బాలు పాటలతో పెనవేసుకుని ఉన్నాయి. ఒక తరం పూర్తిగా ఆయన పాటలు వింటూ పెరిగింది. ఇక టీవీ షోల ద్వారా ఎందరో గాయనీగాయకులను ఆయన ప్రోత్సహించారు. సినీ రంగంలో నిలదొక్కుకునేందుకు ఊతమిచ్చారు. పాటే కాదు, భావి తరాలకు వినయం, విధేయత వంటి సుగుణాలను కూడా బాలుగారు తెలియజెప్పారు. ఈ రోజు వాళ్లందరూ బాలు పాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగువారే కాదు, తమిళం, కన్నడం, మలయాళం, ఉత్తరాది రాష్ట్రాల అభిమానులు కూడా బాలు రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత మంది సంకల్పం ఊరికే పోదు. కచ్చితంగా బాలు మళ్ళీ మన కోసం పాడేలా చేస్తుంద`న్నారు విజయశాంతి. చాలా రోజుల తర్వాత విజయశాంతి తెరపైకి రీఎంట్రీ ఇచ్చి మహేష్‌బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.