హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌.వై నిర్మిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో విలన్ పాత్రకు గానూ మొదట్లో విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే డేట్స్ సమస్యతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటన్నానని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో విజయ శాంతిని అనుకుంటే ఆమెకూడా నో చెప్పిందని సమాచారం. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి ఈ సినిమాలో కీ రోల్ రాసారట సుకుమార్. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, సినిమా చేయటానికి ఆసక్తి లేదని సున్నితంగా నో చెప్పిందిట. దాంతో ఇప్పుడు విజయశాంతి కు అనుకున్న పవర్ ఫుల్ పాత్రకు ఎవర్ని తీసుకోవాలనేది పెద్ద సమస్య గా మారింది. 

ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడిమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌ నుంచి బన్ని కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫొటోలో ఆయన ఎర్రటి చారల చొక్క ధరించి మాస్‌ అవతారంలో అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపించారు. 

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఈ తరహా సినిమా చేయడం ఇదే తొలిసారి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అందరికీ నచ్చేలా సుకుమార్‌ ఈ సినిమా కథను అద్భుతంగా రెడీ చేశారు’’అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ... ‘‘అన్ని భాషల్లో ఉన్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి ఓ స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చే రీతిలో ఈ సినిమా కథ రెడీ చేశా. బన్ని, చిత్ర నిర్మాతలు అందిస్తున్న సహకారంతో.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా మారేడిమిల్లి అడవుల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా’’ అన్నారు సుకుమార్‌. ‘‘ప్రేక్షకుల్ని కొత్తగా అలరించడానికి మేమెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామ’’న్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఎడిటర్: కార్తిక్‌ శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: మిరోస్లోవ్‌ కుబ బ్రోజెక్‌.