సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందిస్తోన్న తాజాగా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.

దాదాపు పదమూడేళ్ల తరువాత ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె పాలిటిక్స్ కి దూరమవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై విజయశాంతి క్లారిటీ ఇచ్చింది.

సినిమాల్లో నటిస్తే రాజకీయాలకు దూరమవుతారా..? అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయని.. తనకు అలాంటి ఆలోచన లేదని, సినిమాల్లో నటించే అవకాశం ఆరునెలల కిందటే వచ్చిందని, కానీ ఎన్నికల ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తనను స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించిందని.. ఆ పని పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదని, తనకు రాజకీయాల పట్ల అంత కమిట్మెంట్ ఉందని చెప్పుకొచ్చింది. 

ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు పార్టీ చెప్పిన పనులు తూచా తప్పకుండా చేయడం వలనే తనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారనే విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చని, అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదని చెప్పుకొచ్చింది.