ఒకప్పటి స్టార్ హీరోయిన్, హీరోలతో సమానంగా రెమ్యునేషన్ తీసుకున్న నటి, అత్యధిక  హీరోయిన్ ఓరియెంటెడ్  పాత్రలు చేసిన ఆర్టిస్ట్.. ఆమె ఉంటే సినిమాకు కలెక్షన్ల సునామి. ప్రాంతీయ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన ఘనత.. ఎవరూ అంటే కళ్లు మూసుకుని చెప్పగలిగే సమాధానం విజయశాంతి. 13 సంవత్సరాల అనంతరం మళ్లీ కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇస్తోంది.

విజయశాంతి తాజాగా మహేష్ బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' తో రీఎంట్రీ ఇస్తున్నారు.  ఇక్కడ విశేషమేమిటంటే విజయశాంతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సూపర్ స్టార్ కృష్ణ చేసిన 'కిలాడి కృష్ణ' సినిమాతో.  ఆ తరవాత 180 సినిమాలు చేసిన ఆమె మళ్ళీ ఇప్పుడు కృష్ణ కుమారుడు మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.  ఇక ఈ ఒక్క సినిమాతోనే విజయ శాంతి తన సిని ప్రస్తానం ఆపేటట్లు లేరు. వరసగా కథలు వింటున్నారు. తాజాగా మరో సినిమా కమిటయ్యినట్లు సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందనున్న చిత్రంలోనూ ఆమె కీలకమైన పాత్రను పోషించనున్నారు. డ్యూయిల్ రోల్ లో చిరు కనిపించే ఈ చిత్రంలో విజయశాంతి ఆయనకు పెయిర్ గా కనిపించబోతోందని అంటున్నారు. ఒకప్పటి హిట్ పెయిర్ మళ్లీ తెరపై కనపడితే పండగే కదా. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.