తమిళ సూపర్‌ స్టార్‌, దళపతి విజయ్‌కి షాక్‌ తగిలింది. ఆయన నటిస్తున్న `మాస్టర్‌` సినిమా లీక్‌ అయ్యింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు(బుధవారం) సంక్రాంతి కానుగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమా లీక్‌ అయ్యాయి. అయితే సినిమా మొత్తం కాకుండా, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు లీకై సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా చిత్ర బృందం ఖంగుతిన్నది. 

సినిమాలోని కీలకమైన ఇంటర్వెల్‌ సీన్‌, చిన్న చిన్న క్లిప్పింగ్స్ లీక్‌ అయినట్టు సమాచారం. ఆదివారం అర్థరాత్రి నుంచి ఈ సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో చిత్ర బృందం స్పందించి, వాటిని డిలీట్‌ చేయిస్తున్నాయి. దీనిపై దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. `మాస్టర్‌` సినిమాని మీకు అందించాలని ఏడాదిన్నరగా కష్టపడుతున్నాం. మీరు కచ్చితంగా థియేటర్‌లో ఆ అనుభూతిని పొందుతారని, సినిమాని ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాం. సినిమాకి సంబంధించిన లీకైన సీన్లని ఎవరూ షేర్‌ చేయవద్దు. మీ ప్రేమకి ధన్యవాదాలు` అని ట్వీట్‌ చేశారు కనగరాజ్‌. 

విజయ్‌ హీరోగా, విజయ్‌ సేతుపతి విలన్‌గా, మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా సాగనుంది. ఇదిలా ఉంటే ఇటీవల సౌత్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` టీజర్‌ కూడా లీకైన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం టీజర్‌ని అధికారికంగా విడుదల చేశారు. నిజానికి దాన్ని ఓ రోజు తర్వాత హీరో యష్‌ పుట్టిన రోజు గిఫ్ట్ గా రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ లీక్‌ వీరులు అప్పుడే సోషల్‌ మీడియాలో పెట్టడంతో గత్యంతరం లేక వెంటనే విడుదల చేసింది యూనిట్‌. అది రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.