చిత్ర పరిశ్రమలో పలువురు సెలెబ్రిటీలు కులాలకు, మాటలకూ అతీతంగా వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో మరో మతాంతర వివాహానికి తెరలేచింది. 

తమిళ యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఇళయదళపతి విజయ్ ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. హీరో విజయ్, గద్దలకొండ గణేష్ ఫేమ్ హీరో అథర్వ ఇద్దరూ బంధువులు కాబోతున్నారు. విజయ్ మేనత్త మనవరాలు(విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెల్లెలి మనవరాలు) స్నేహ, అథర్వ తమ్ముడు ఆకాష్ మురళిల వివాహం త్వరలో జరగబోతోంది. 

స్నేహ, ఆకాష్ మురళి ఇద్దరూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల నుంచే వీరిమధ్య ప్రేమ మొదలైంది. ఎట్టకేలకు వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులని ఒప్పించి వివాహానికి సిద్ధం అవుతున్నారు. హీరో విజయ్ ఫ్యామిలీ క్రిస్టియన్స్. దీనితో మతాంతర వివాహం కావడంతో ఇన్నిరోజులు పాటు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. ఎట్టకేలకు పెద్దలు తమ పెళ్ళికి అంగీకరించడంతో ఈ జంట ఒక్కటి కాబోతోంది. 

డిసెంబర్ 6న స్నేహ, ఆకాష్ మురళిల నిశ్చితరార్థం జరగనుంది. స్నేహ దర్శకురాలిగా కూడా 'సత్తం ఒరు ఇరుత్తరై' అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ప్రస్తుతం వీరిద్దరి వివాహం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.