ఇళయదళపతి విజయ్ తమిళంలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ కి రజని స్థాయిలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. అతడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. విజయ్ చేస్తున్న చిత్రాల్లో ఎక్కువగా రాజకీయ, సామజిక పరమైన అంశాలు ఉంటున్నాయి.

విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'బిగిల్'. మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీ.. విజయ్ తో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. 

ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. షూటింగ్ చివరి రోజు సందర్భంగా ఈ చిత్రానికి పని చేసిన 400 మంది టెక్నీషియన్లకు విజయ్ మరచిపోలేని గిఫ్ట్ అందించాడు. 400 మందికి బిగిల్ టైటిల్ ఉండే గోల్డ్ రింగ్స్ ని గిఫ్ట్ గా అందించాడు. అలాగే తన ఆటోగ్రాఫ్ తో ఉండే ఫుట్ బాల్స్ ని కూడా బహుమతిగా చిత్ర యూనిట్ కు అందించడం విశేషం. విజయ్ గిఫ్ట్ గా అందించిన గోల్డ్ రింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.