విజయ్‌ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోంది. `వీడీ12` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌ ఆకట్టుకుంటుంది.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తున్న ఆయన.. ఇటీవలే పరశురామ్‌ సినిమాని ప్రారంభించాడు. తాజాగా గౌతమ్‌ తిన్ననూరి సినిమా రెగ్యూలర్‌ షూట్‌ని స్టార్ట్ చేశారు. శుక్రవారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. విజయ్‌ దేవరకొండ 12 వ సినిమాగా ఇది రూపొందుతుంది. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ని నేటి నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ప్రారంభించారు. 

తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో విజయ్‌ దేవరకొండ గన్‌ పేలుస్తూ కనిపిస్తున్నారు. ఆ పొగ వెనకాల విజయ్‌ ఫేస్‌ కనిపిస్తుంది. బ్లాక్‌ టోన్‌లో పోస్టర్‌ ఉంది. యాక్షన్‌ కథతో ఈ సినిమా రూపొందుతుందని, ఇందులో గూఢచారిగా విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలుస్తుంది. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లోనూ విజయ్ లుక్‌ అందుకు దగ్గరగా ఉంది. ఇక విజయ్‌ దేవరకొండకి జోడీగా యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కథానాయికగా నటిస్తుండటం విశేషం. 

`జెర్సీ` వంటి జాతీయ అవార్డు సినిమాని రూపొందించిన గౌతమ్‌ తిన్ననూరి నుంచి వస్తోన్న సినిమా కావడం, విజయ్‌ దేవరకొండ స్పైగా కనిపించడం, శ్రీలీల హీరోయిన్‌ కావడం వంటి అంశాలతో ఈ సినిమాపై క్రేజ్‌ నెలకొంది. ప్రారంభం ముందే మంచి హైప్‌ నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. గిరీష్‌ గంగాధర్‌ కెమెరామెన్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఆ మధ్య ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పేపర్లు కట్‌ చేసినట్టుగా, వాటి బ్యాక్‌ డ్రాప్‌లో విజయ్‌ ఫేస్‌, కింద బ్లాక్‌ లో పోస్టర్‌ ఉంది. అది వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తాజాగా ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతుంది.