విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ తెర‌కెక్కించిన సినిమా డియ‌ర్ కామ్రేడ్. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జులై 26న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీకి సంబంధించి మేక‌ర్స్ ఇప్పటికే జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు.  రీసెంట్ గా జ‌ర‌గిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిన్న రాత్రి (జులై 24, 2019) 7 గంటలకు విశాఖ జిల్లా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో ఓ యువకుడు హల్‌చల్ చేయటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
 
వివరాల్లోకి వెళితే...ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ జరుగుతున్నప్పుడు విజయ్ దేవరకొండ..చిత్ర దర్శకుడు గురించి మాట్లాడుతున్నారు. ఆ  సమయంలో సెక్యూరిటీ, బౌన్సర్లను దాటుకుని ఓ యువకుడు స్టేజ్‌పైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతేకాదు, వచ్చిన వెంటనే విజయ్ కాళ్లపై పడ్డాడు. దీంతో పక్కన ఉన్న వారు వెంటనే రియాక్ట్ అయ్యి విజయ్‌ను పట్టుకోవడంతో కింద పడకుండా ఆగాడు. లేకుంటే దేవరకొండ కింద పడిపోయేవాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అంతా షాక్ అయ్యారు.

వెంటనే తేరుకున్న విజయ్ దేవరకొండ మాత్రం... ‘‘ఏమిరా..? ప్రేమతో వచ్చినవా..? ఎటాక్ చేయడానికి వచ్చావా..?'' అన్నారు. దాంతో ఫ్యాన్స్ అంతా గట్టిగా కేకలు పెట్టారు.  ఇది జరిగాక తర్వాత విజయ్ మాట్లాడడం కొనసాగించాడు.  కానీ, ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా గోల చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏమైందా అని చూసిన విజయ్‌కు.. ఆ యువకుడిని తన సెక్యూరిటీ ఇబ్బంది పెట్టడం కనిపించింది. దీంతో వెంటనే ‘‘హేయ్ బాబీ.. వదిలేయండి వాడిని. చోడ్‌దో ఉస్‌కో. ఒరేయ్.. నువ్వు కామ్‌గా వెళ్లిపోరా.. ఉరుకులు పెట్టకు'' అంటూ పంపించేశాడు. ఇక అక్కడి నుంచి అతడు తన ప్రసంగాన్ని కొనసాగించాడు.